Volunteer Meet CM Jagan: జగనన్నా.. నీ వలంటీర్‌ని

22 Apr, 2022 22:40 IST|Sakshi

భవనంపై నుంచి కేకవేసిన వలంటీర్‌ షీలా రాణి

సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చిన వలంటీర్‌

ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని పలకరించిన సీఎం  

ఒంగోలు సబర్బన్‌: ‘‘జగనన్నా...నీ వలంటీర్‌ను’’ అని ఒక యువతి పెద్దగా కేకవేసింది. ఆ కేక వినగానే సీఎం వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ను ఆపారు. కారు లోంచి కిందకు దిగిన సీఎం వైఎస్‌ జగన్‌ సెక్యూరిటీని పంపి ఆ యువతిని తీసుకురమ్మన్నారు. దీంతో పరుగున వెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది ఆ యువతిని భవనంపై నుంచి కిందకు రమ్మని సీఎం వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆ యువతి ముందుగా తెచ్చుకున్న పూల బొకేను వెంట తీసుకొచ్చి సీఎం వైఎస్‌ జగన్‌కు ఇచ్చింది. తన పేరు షీలా రాణి అని చెప్పింది.

దీంతో సీఎం ‘‘ఏం తల్లీ.. వలంటీర్‌గా ఎక్కడ చేస్తున్నావు’’ అని అడిగాడు. ఒంగోలు రంగుతోటలోని వార్డు సచివాలయం పరిధిలో వలంటీర్‌గా పనిచేస్తున్నానని చెప్పింది. దీంతో ఆ యువతి షీలా రాణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మిమ్మల్ని కలవాలనుకున్న కల నెరవేరిందని షీలా రాణి సీఎంతో స్వయంగా చెప్పింది. ఆ సమయంలో సీఎం పక్కన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రవిప్రియ మాల్‌ అధినేత కంది రవి శంకర్, బొత్స ఝాన్సీ ఉన్నారు.  

కాగా ఒంగోలు బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్‌ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి జమచేశారు.

మరిన్ని వార్తలు