క్షేమంగా తిరిగొచ్చిన అమర్‌నాథ్‌ యాత్రికులు

13 Jul, 2022 04:42 IST|Sakshi
అమర్‌నాథ్‌ నుంచి సురక్షితంగా తిరిగొచ్చిన యాత్రికులు వీరే

విజయవాడకు చేరుకున్న 35 మంది యాత్రికుల బృందం

నందిగామ: భగవంతుని దర్శనానికి వెళ్లిన వారు భద్రంగా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. పరమేశ్వరుని దయతో విపత్తు నుంచి సురక్షితంగా బయటపడ్డామని చెబుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి 35 మందితో కూడిన బృందం అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లింది. వీరిలో చందర్లపాడు మండలానికి చెందిన అత్తలూరి సత్యనారాయణ, అత్తలూరి పార్వతమ్మ, అత్తలూరి అక్షయలింగ శర్మ, అత్తలూరి కనకదుర్గ, అత్తలూరి దశరథరామశర్మ, అత్తలూరి మంజు ఉన్నారు.

వీరితోపాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన మరో 29 మంది కలిపి మొత్తం 35 మంది గత నెల 27న విజయవాడ నుంచి రైలులో అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరారు. ఈ నెల 8న సాయంత్రం 3.30 గంటలకు అమరనాథుని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. కొద్దిసేపటికే అప్పటివరకు వారు బస చేసిన ప్రాంతాన్ని వరద ముంచెత్తింది.

వీరంతా అప్పటికే ఆ ప్రాంతాన్ని వదిలి కొద్దిదూరం వచ్చేయటంతో సురక్షితంగా బయటపడగలిగారు కానీ, ఆ భీతావహ వాతావరణంలో కొందరు బృందం నుండి విడిపోయారు. తప్పిపోయిన వారు ఆదివారం ఉదయం శ్రీనగర్‌కు చేరుకోవటంతో ఆర్మీ సిబ్బంది మొత్తం 35 మందిని ఒకే బస్సులో ఎక్కించి ఆదివారం రాత్రికి జమ్మూకు చేరవేశారు. అక్కడి నుంచి చండీగఢ్‌æకు వచ్చి, అక్కడి నుంచి రైలు ద్వారా మంగళవారం రాత్రికి విజయవాడకు చేరుకున్నారు.

దేవుడే రక్షించాడు
విపత్తు సంభవించటానికి కొద్దిసేపటి ముందువరకు మేము అక్కడే ఉన్నాము. అక్కడి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే భీతావహమైన ఘటన చోటు చేసుకుంది. అలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదు. దేవుడు మమ్మల్ని రక్షించాడు. 
– అత్తలూరి పార్వతమ్మ, చందర్లపాడు

ప్రభుత్వం సహకరించింది
కొండ మార్గంలో ఒక్కసారిగా వరద ముంచెత్తిన సమయంలో మాతో వచ్చిన కొందరు తప్పిపోయారు. మన ప్రభుత్వం చొరవ చూపి జిల్లా అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు మా యోగక్షేమాలు విచారించింది. మొత్తం మీద సురక్షితంగా ఇంటికి చేరాం.
    – అత్తలూరి అక్షయలింగ శర్మ, చందర్లపాడు 

>
మరిన్ని వార్తలు