అల్ల.. నేరేడువనంలో..

18 Jul, 2022 23:35 IST|Sakshi
తోటలో కోసిన కాయల్ని గ్రేడింగ్‌ చేస్తున్న దృశ్యం

రైతుల పాలిట కల్పతరువు  

విరగ్గాసిన పంట

కిలో రూ.100 నుంచి 120

గుర్రంకొండ : రైతుల పాలిట కల్పతరువుగా మారింది అల్లనేరేడు. రైతుల లభాల రేడు అల్లనేరేడు కాయలు ఈ ఏడాది విరగ్గాశాయి. ప్రస్తుత సమాజంలో అత్యధిక జనాన్ని పట్టిపీడిస్తున్న చక్కెర(షుగరు)వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వారు తియ్యగా ఉండే ఈ పండ్లను తినవచ్చు. వారికి అన్ని రకాలుగా ఈ కాయలు దివ్య ఔషధం లాగా ఉపయోగ పడుతున్నాయి.  దీంతో ఈ సీజన్‌లో ఈ కాయలకు భలే డిమాండ్‌ ఏర్పడింది.

పలువురు చక్కెర వ్యాధిగ్రస్తులు అల్లనేరేడు కాయల్లోని గింజల్ని ఎండబెట్టుకొని పొడిగా చేసుకొని తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. చక్కెర వ్యాధి గ్రస్తులకు అల్లనేరేడు కాయలు దివ్య ఔషధంలా పని చేస్తున్నాయి. దీంతో మార్కెట్లో వీటికి భలే డిమాండ్‌ ఏర్పడింది. కరువు రైతు ఇంట లభాల పంటగా అల్లనేరేడు మిగిలింది.

749 హెక్టర్లలో సాగు
నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో మొత్తం 746 హెక్టార్లలో అల్లనేరేడు తోటల పెంపకం చేపట్టారు. ఈ ఏడాది మొత్తం 2090 క్వింటాళ్ల అల్లనేరేడు దిగుబడి వచ్చింది. నల్లబంగారంగా పేరున్న ఈ కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది.  ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.100 ధర పలుకుతుండడంతో  రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి.  బయట రాష్ట్రాల్లోని మార్కెట్లో కిలో రూ.120 వరకు ధరలు పలుకుతున్నాయి.

దీంతో రెతులు ఈ ఏడాది లాభాలు చవిచూస్తున్నారు.  ముఖ్యంగా హైబ్రీడ్‌ రకం కాయలు పెద్దపెద్ద సైజుల్లో కాసి చూపరులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. హెబ్రీడ్‌ కాయల్లో గింజ శాతం తక్కువగా ఉండి గుజ్జు శాతం ఎక్కువగా ఉండడం వీటి ప్రత్యేకత.  ఇలాంటి రకం కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉండి మంచి ధరలు పలుకుతున్నాయి.  సగటున ఎనిమిది సంవత్సరాల వయసున్న అల్లనేరుడు చెట్టు సరాసరి 25 నుంచి 35 కిలోల వరకు కాయలు కాస్తున్నాయి. ఈఏడాది తోటల్లో చెట్లకు మంచి కాపు పట్టింది.

బయట రాష్ట్రాలకు ఎగుమతి
నియోజకవర్గంలోని అల్లనేరేడు కాయల్ని రైతులు, వ్యాపారుల బయట రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కొంత మంది వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు తోటల్లోనే కాయల్ని మూడు రకాలుగా గ్రేడింగ్‌ చేస్తున్నారు. ఏ రకం గ్రేడు కాయల్ని కిలో రూ. 120 చొప్పున విక్రయిస్తున్నారు. బిగ్రేడ్‌ రకం కాయల్ని కిలో రూ.100 వరకు, సీగ్రేడ్‌ రకం కాయల్ని రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఈప్రాంతంలోని కాయల్ని తిరుపతి, కడప, బెంగుళూరు, చెన్నై వంటి పట్టణాలకు తరలిస్తుంటారు.

దివ్య ఔషధంగా అల్లనేరేడు
ప్రస్తుత సమాజంలో అల్లనేరేడు పలువురికి దివ్వ ఔషధంగా మారిది.  మధుమేహం అదుపుకు, శరీర సమస్యలకు  చాలా ఉపయోగ పడుతోంది. ఇందులో సోడియం, పొటాషియం, కాల్షియం,జింక్‌ ఫోలిక్‌ యాసిడ్స్‌ సమృద్ధిగా ఉంటాయి. రక్తశుద్ధితోపాటు హిమోగ్లోబిన్‌ పెంచుతుంది. అస్తమా, ఊపరితిత్తుల వ్యాధులను దూరం చేస్తుంది.

 రక్తంలో కేన్సర్‌ కణాలు వృద్ధి చెందకుండా నిరోధిస్తాయి. దంతసమస్యలను చాలా వరకు తగ్గిస్తాయి. గ్యాస్, మూత్ర సమస్యలు చర్మవ్యాధులు, కీళ్ల సమస్యలను నివారించడంలో తోడ్పడుతాయి. ఇంకా పలు రకాల జబ్బులకు ఇది ఔషధంలా పనిచేస్తుంది. దీంతో మార్కెట్లో వీటికి మంచి డిమాండ్‌ ఉంటోంది.

మరిన్ని వార్తలు