విశాఖపట్నానికి ‘అమెజాన్‌’ 

18 Dec, 2022 04:00 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో మరో ప్రముఖ ఐటీ సంస్థ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, రాండ్‌స్టాడ్‌ తదితర పలు ప్రముఖ సంస్థలు విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించగా.. తాజాగా అమెజాన్‌ సంస్థ.. డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. విశాఖలో సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, ఐటీ ఆధారిత సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అమెజాన్‌ దరఖాస్తు చేసుకున్నట్లు సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) ప్రకటించింది.

ప్రాథమిక అనుమతులు మంజూరు చేశామని.. త్వరలోనే సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఎస్‌టీపీఐ విశాఖ డైరెక్టర్‌ సీవీడీ రామ్‌ప్రసాద్‌ ‘సాక్షి’కి వివరించారు. అమెజాన్‌ తొలి దశలో 120 సీటింగ్‌ సామర్థ్యంతో ఈ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో ఈ కేంద్రం ద్వారా రూ.184.12 కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతాయని ఆ సంస్థ ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. దశలవారీ విస్తరణ అనంతరం.. ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందన్నారు.

అమెజాన్‌ వంటి ప్రముఖ సంస్థ విశాఖలో అడుగు పెట్టడమనేది.. మరిన్ని కంపెనీల ఏర్పాటుకు ఊతమిస్తుందన్నారు. అలాగే పలు పెద్ద కంపెనీలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి చర్చలు జరుపుతున్నాయన్నారు. జనవరిలో విశాఖ కేంద్రంగా ఐటీ సదస్సు, ఫిబ్రవరిలో గ్లోబల్‌ టెక్నాలజీ సదస్సు జరగనున్న నేపథ్యంలో మరిన్ని ఐటీ కంపెనీలు రాష్ట్రంలో అడుగు పెట్టే అవకాశముందన్నారు.   

మరిన్ని వార్తలు