టీడీపీ ఉనికికే ప్రమాదం

10 Apr, 2021 03:55 IST|Sakshi

తిరుపతిలో వైఎస్సార్‌సీపీ గెలవటం ఖాయం 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు 

సాక్షి, అమరావతి: తిరుపతి ఎన్నికల్లో ఫలితాలెలా ఉంటాయనే ఉత్కంఠ ఎవరికీ లేదని, ఎవరు రెండో స్థానాన్ని ఆక్రమిస్తారు.. వైఎస్సార్‌సీపీకి ఎంత మెజారిటీ వస్తుంది అనే దానిపైనే అందరి దృష్టీ ఉందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. టీడీపీ ఉనికికే ప్రమాదం వచ్చిన సందర్భంలో బాబు, ఆయన కుమారుడు వీధి వీధి తిరుగుతున్నారని, అయినా కూడా జనం రావడంలేదని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్‌ ఎక్కడైనా గెలిచి.. అప్పుడు సీఎం జగన్‌పై సవాల్‌ చేయాలన్నారు.

లోకేశ్‌ ఒక ఐరన్‌ లెగ్‌ అని.. ఎక్కడ కాలు పెడితే అక్కడ టీడీపీ మటాష్‌ అని అంబటి చెప్పారు. వెంకన్న సాక్షిగా మోదీ, చంద్రబాబు, పవన్‌ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ, జనసేన పాత మిత్రులేనని.. విభజన హామీలు నెరవేర్చని బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలన్నారు. వకీల్‌సాబ్‌ సినిమాకు.. ఎన్నికలకు సంబంధం ఏమిటని నిలదీశారు. బీజేపీ నేత సునీల్‌ దేవ్‌ధర్‌ ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు లేదని.. సినిమా ప్రచారానికి వచ్చినట్లు ఉందని చెప్పారు. తిరుపతిలో సొంతంగా గెలిచిన చరిత్ర టీడీపీకి లేదన్నారు. ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ అమలుచేస్తున్నారని చెప్పారు.  

ఓటమి భయంతోనే వ్యక్తిగత విమర్శలు 
ఓటమి భయంతో సీఎం జగన్‌పై బాబు, లోకేశ్, పవన్‌లు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో భారీ మెజార్టీతో వైఎస్సార్‌సీపీ గెలవటం ఖాయమన్నారు. వివేకా హత్యపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారని.. ఆ ఘటనపై సీబీఐ విచారణ జరుగుతోందన్నారు. 

మరిన్ని వార్తలు