2023 సెప్టెంబర్‌కు వెలుగొండ పూర్తి 

13 Sep, 2022 04:14 IST|Sakshi
వెలుగొండ ప్రాజెక్టు డ్యామ్‌ను పరిశీలిస్తున్న మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్‌

నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు

పెద్దదోర్నాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టును 2023 సెప్టెంబర్‌నాటికి పూర్తి చేసి మూడు జిల్లాల ప్రజలకు నీరందిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. సోమవారం కొత్తూరు వద్ద జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆధికారులు, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్షించారు.

ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న 7,200 కుటుంబాలకు పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును ఆయన కుమారుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని చెప్పారు. పనులు చేపట్టిన సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులకు చెప్పారు.

ఇది ప్రకాశం నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లోని 15 లక్షల మంది ప్రజలకు తాగు నీరు, 4,50,000 ఎకరాలకు సాగు నీరు అందించే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని అన్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ. 8 వేల కోట్లు అయితే ఇప్పటివరకు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో ప్రతి ఒక్కరి న్యాయమైన కోరికను నెరవేరుస్తామని తెలిపారు. ప్రాజెక్టు పనులపై ప్రతి నెలా సమీక్షిస్తామన్నారు. సుమారు 1,500 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. 11.5 ఎకరాలకు సంబంధించి టీ5 పోర్షన్‌కు రూ.85 కోట్లు ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మంజూరు చేసి పరిపాలన అనుమతులు ఇచ్చారన్నారు.  

మరిన్ని వార్తలు