ఈ రాతలేంటి రామోజీ..?

16 Nov, 2020 21:49 IST|Sakshi

 మీ పుట్టిన రోజున, జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం రోజున కూడా అవాస్తవ కథనాలా?

వాటికి పతాక శీర్షికలా!

ఈనాడు మొదటి పేజీలో కూడా నిజాలు ప్రచురించాలనే నియమం లేకపోవడం దురదృష్టకరం

మీరు రాసిన ఆ ఆరు వార్తల్లో అసత్యాలు, అర్థ సత్యాలు పాఠకుల ముందుంచుతున్నాను

వేల కోట్లు ఎగనామం పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన మీ మిత్రుడు చంద్రబాబుపై ఏనాడైనా వార్తలు రాశారా?

ఈనాడు అధినేత రామోజీరావుకి అంబటి రాంబాబు ఘాటైన లేఖ

సాక్షి, అమరావతి: జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం రోజున, స్వయంగా తన జన్మదినోత్సవం రోజున రామోజీరావు తన ఈనాడు పత్రికలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై అబద్ధపు వార్తలను ప్రచురించారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఒకే రోజున ఈనాడు మొదటి పేజీలో ఆరు అబద్ధపు వార్తలు ప్రచురించిన తరువాత నిత్యం ఉషోదయాన ఈనాడులో సత్యాలు నినదిస్తున్నాయా? అసత్యాలు నినదిస్తున్నాయా? అని రామోజీ తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు. ఈనాడులో ఈ నెల 16వ తేదీన ఒకే రోజు వచ్చిన వార్తలపై వాస్తవాలను పాఠకుల ముందుంచుతూ రాంబాబు సోమవారం ఒక సుదీర్ఘమైన బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

గౌరవనీయులు రామోజీరావుకి..
జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, మీ జన్మదినోత్సవం కలిపిన రోజున మీ పత్రిక ఈనాడులో వచ్చిన వార్తాకథనాలు చూసిన తరువాత ఈ ఉత్తరం రాస్తున్నాను. ‘బదిలీలు చేశారు... నియామకాలేవి?’ అన్నది మీ పత్రికలో పతాక శీర్షిక కథనం. ‘మళ్లీ కేంద్ర సర్వీసుకు ప్రవీణ్‌ ప్రకాష్‌’ అన్నది ఆ వార్త పక్కనే వేసిన మరో కథనం. ‘సచివాలయ భవనం.. అసంపూర్ణం’ అన్నది మధ్య పేజీ కింది భాగంలో ప్రచురించిన మరో వార్తా కథనం. దానికి పక్కనే కుడి వైపున మరో రెండు వార్తలు ప్రచురించారు. ‘రాత్రికి రాత్రే హోటల్‌ స్వాధీనం’, ‘కిడ్నాప్‌ చేసి చావ బాదారు’ అన్నవి మరో రెండు వార్తలు. ‘టిడ్కో ఇళ్ల వద్ద 144వ సెక్షన్‌’ అన్నది మరో వార్త. ఈ అర డజను వార్తలు మీ పత్రిక మొదటి పేజీలో వచ్చాయి. జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవానికి గౌరవ మర్యాదలు ఇవ్వాలా.. వద్దా అన్నది మీ ఇష్టం గాని, కనీసం మీ పుట్టిన రోజున అయినా మీ పత్రిక మొదటి పేజీలో నిజాలు ప్రచురించాలనే నియమం లేక పోవటాన్ని దురదృష్టంగా భావించాల్సి వస్తోంది. ఈ ఆరు వార్తలూ అసత్యాలూ.. అర్థ సత్యాలతో ఎలా రాశారో పాఠకుల ముందుంచుతున్నాను. 

వార్తా కథనం -1
‘బదిలీలు చేశారు... నియామకాలేవి? శీర్షికతో మీరు వండి వార్చిన వార్తలో... జర్నలిజంలో మౌలికమైన అంశాన్ని వదిలేశారు. ‘రాష్ట్రంలో 84 జూనియర్‌ కళాశాలలలను మంజూరు చేసిన అధికారులు... వీటికి బోధనా సిబ్బందిని మంజూరు చేయలేదు’ అనే వాక్యంతో మీ వార్తా కథనం ప్రారంభించారు. 84 జూనియర్‌ కళాశాలలను ఏ ప్రభుత్వం మంజూరు చేసింది? ఎప్పుడు మంజూరు చేసింది? ఎందుకు పార్ట్‌ టైం ఉపాధ్యాయుల నియామకం అవసరమైంది? ఎందుకు బదిలీలు చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పతాక శీర్షిక ఎందుకు ప్రచురించారు? అందులో వాస్తవాలు ఎందుకు దాచారు? వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లుగా ఆ వార్తను ఎందుకు వండి వార్చారు? నిజానికి ఎన్నికల ముందు ఈ 84 జూనియర్‌ కాలేజీలను మీ మిత్రుడు చంద్రబాబునాయుడు తాను దిగి పోతూ పద్ధతీ పాడూ లేకుండా మంజూరు చేసిన దాని వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రాయటానికి మీ కలానికి మనసు ఎందుకు లేకపోయింది? కళాశాలలు మంజూరు చేసినప్పుడు.. అందులో ప్రిన్సిపాల్‌ పోస్టులు తప్ప లెక్చరర్‌ పోస్టులకు ఫైనాన్స్‌ అనుమతులు, బడ్జెట్‌లు లేకుండా కాలేజీలు ఎలా మంజూరు చేశారు? ఏ ప్రాతిపదికన పార్ట్‌టైం (మీ భాషలో ఒప్పంద) లెక్చరర్లను నియమించారు? వారికి జీతాలు ఇవ్వాలంటే పోస్టులు ఉండాలి కదా? పోస్టులు, పోస్టుకు ఫైనాన్స్‌ శాఖ ద్వారా జీతానికి సంబంధించిన అనుమతులు లేకుండా కాలేజీలు ఇచ్చేశాం అని చంద్రబాబు చేతులు దులుపున్నాడని రాయటానికి మీకు ఎందుకు మీ పాలసీ అంతగా అడ్డం వస్తోంది? చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దుతున్న ప్రభుత్వం మీద రాళ్లు వేయటానికి మీరెందుకు ఇంతగా ఆరాటపడుతున్నారు? 

వార్తా కథనం -2
‘మళ్లీ కేంద్ర సర్వీసుకు ప్రవీణ్‌ ప్రకాష్‌’ అన్నది మరో వార్తా కథనం. ఎవరు చెప్పారు? కేంద్ర సర్వీసులకు తాను వెళ్లాలని అనుకుంటున్నట్లు? ప్రవీణ్‌ ప్రకాష్‌ మీతో చెప్పారా? ఇదే అబద్ధం అయితే, దానికి కొనసాగింపుగా ‘ముఖ్యమంత్రి సుముఖంగా స్పందించారని’ మరో అబద్ధాన్ని రాశారు. రాజకీయ నాయకుల మీద మీ ఇష్టం వచ్చినట్లు రాసే ధోరణి నుంచి అధికారులను గందరగోళపరిచే చీఫ్‌ ట్రిక్స్‌కు మీ పత్రికను ఎందుకు? ఎవరి కోసం వేదికగా మార్చుకున్నారో మీకే బాగా తెలుసు.

వార్తా కథనం -3
‘సచివాలయ భవనం.. అసంపూర్ణం’ అంటూ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం కోసం కొత్త ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రజాస్వామ్య దేవాలయాల మీద కూడా ఏదో ఒక రాయి విసరకపోతే బాగోన్నట్లుగా వార్తాకథనం తయారు చేసి అచ్చు వేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పది వేలకు పైగా గ్రామ సచివాలయాలు, 10 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు, 8,500కు పైగా ఆరోగ్య కేంద్రాల నిర్మాణం మొత్తంగా దాదాపు 30 వేల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటమే కాకుండా ఇప్పటికే దాదాపు రూ.3,088 వేల కోట్లు వెచ్చించింది. ఈ మొత్తంలో కేవలం రూ.180 కోట్ల మేరకు బకాయిలు ఉంటే.. అది కూడా వారంగా చెల్లించాల్సిన మొత్తం మాత్రమే బకాయిలు ఉంటే.. ‘అసంపూర్ణం’ అని శీర్షిక పెట్టడాన్ని జర్నలిజం అంటారా? 13 జిల్లాల్లో జిల్లాకు కేవలం రూ.10 కోట్ల మేరకు, అది కూడా వారం రోజుల్లో చెల్లించాల్సిన మొత్తం మాత్రమే బకాయి ఉంటే... దాన్ని గురించి ఇంత బాధపడుతున్న మీ సున్నిత హృదయం చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏళ్ల తరబడి పెండింగ్‌ పెట్టిన వేల కోట్ల బకాయిల గురించి ఒక్క వార్త కూడా రాయాలనిపించకపోవడం మీ పత్రికా విలువల సరళికి అద్దం పడుతోంది.

చంద్రబాబు ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు చెల్లించకుండా ఎగ్గొట్టిన బకాయిలు రూ.8,655 కోట్లు. చంద్రబాబు వదలి వేసి పోయిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తనాల సబ్సిడీగా చెల్లించకుండా వదిలి వేసింది రూ.384 కోట్లు. రైతులకు వడ్డీ లేని రుణాల కింద చెల్లించకుండా పెట్టిన ఎగనామం రూ.1,046 కోట్లు. ఇవన్నీ జగన్‌ ప్రభుత్వమే చెల్లించింది. సున్నా వడ్డీ కోసం రైతులకు ఇవ్వాల్సింది.. 2019 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.510 కోట్లు జగన్‌ ప్రభుత్వమే చెల్లించింది. ఎంఎస్‌ఎంఈలకు చెల్లించాల్సిన రాయితీల బకాయీ రూ.983 కోట్లు. ఫీజు రీఇంబర్స్‌మెంటు బకాయీలు రూ.1,880 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయీలు రూ.680 కోట్లు, అగ్రిగోల్డ్‌ బకాయీలు రూ.264 కోట్లు ఇలాంటి సవాలక్ష బకాయీలు చెల్లించుకుంటూ... కోవిడ్‌ సమయంలో, ఆదాయం లేని రోజుల్లో కూడా అటు సంక్షేమ కార్యక్రమాలకు గాని, ఇటు శాశ్వతంగా పది కాలాలపాటు ఉపయోగపడే నిర్మాణాలకు క్యాపిటల్‌ వ్యయం విషయంలో గాని జగన్‌ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. మీ చంద్రబాబు ఇన్ని వేల కోట్లు ఎగనామం పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని.. పైన చెప్పిన విషయాలను మీ పత్రికలో ఏనాడైనా రాశారా?

వార్తా కథనం -4 
‘రాత్రికి రాత్రే హోటల్‌ స్వాధీనం’ అంటూ విశాఖపట్టణంలో ఫ్యూజన్‌ ఫుడ్స్‌ అనే చంద్రబాబు అనుంగు సంస్థకు పప్పు బెల్లాలకు ఇచ్చిన లీజును రద్దు చేయడం అన్యాయం అన్నట్లు వార్తను రాశారు. ఇక్కడా అదే వంచన! ఇంతకూ ఆ హోటల్‌ ఏడాదికి ప్రభుత్వానికి చెల్లించే లీజు ఎంత? ఆ స్థలం విశాఖపట్టణంలో ఎంతటి కమర్షియల్‌ ఏరియాలో ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెబితే మీ కథనంలో గాలి పోతుంది. ఏటా ఈ ఘనమైన సంస్థ ‘ప్రజా సేవ’ చేస్తున్నుట్లుగా ప్రభుత్వానికి ఇస్తున్న లీజు ఘనత వహించిన చంద్రబాబు పుణ్యాన ఏడాదికి రూ.30,000 అంటే నెలకు రూ.2,500. ‘వాట్టే డీల్‌! చౌక బేరాల చరిత్రలో ఇదో రికార్డు. ప్రభుత్వం ఇంత నుంచి చట్టబద్ధంగా అనుమతులు లేకుండా వీఎంఆర్‌డీఏ స్థాయిలోనే లీజులు తీసుకుని అక్కడ కట్టడం కట్టుకుని వ్యాపారం చేస్తుంటే ... అది చట్టబద్ధం కాదని అధికారులు ఖాళీ చేయిస్తుంటే .. చంద్రబాబుకు, రామోజీరావుకు జాయింటూగా ఎందుకు నొప్పి కలుగుతోందన్న అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా? లేక ఈనాడుదా? విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూ ఆక్రమణలు తొలగిస్తుంటే ఆక్రమించుకున్నవారి పక్షాన గొంతెత్తటం, వారికి అనుకూలంగా సానుభూతి కూడగట్టే ప్రయత్నం చేయటంలో ప్రజా ప్రయోజనాలున్నాయా? పత్రికా ప్రయోజనాలున్నాయా? లేక మీ సొంత అజెండా ఉందా?

వార్తా కథనం -5 
కిడ్నాప్‌ చేసి చావ బాదారు అన్నది మరో అసత్య కథనం. సరస్వతీ పవర్‌ అన్నది రామోజీ ఫిల్మ్‌ సిటీ మాదిరిగానే ప్రైవేటు భూములను కొనుగోలు చేసిన సంస్థ. రామోజీ ఫిల్మ్‌సిటీలో భూములు ఖాళీగా ఉన్నాయి కాబట్టి, వాటిని అమ్మిన రైతులు దున్నుకుంటాం అంటే రామోజీ అంగీకరిస్తారా? ఏనాడో సరస్వతీ పవర్‌ కొనుగోలు చేసిన భూముల మీదకు చంద్రబాబు తన మనుషుల్ని పంపి, రైతుల్ని రెచ్చగొట్టటం నేరం అని 2014-19 మధ్య ఈనాడు ఎప్పుడైనా రాసిందా? ఇక రైతును ఎవరో అర్ధరాత్రి బావా బావా అని పిలిచి కొట్టారని రాశారు. అర్ధరాత్రి 2 గంటలకు ఎవరో వచ్చి బావా.. బావా అని పిలిస్తే ఆ రైతు వెళ్ళాడా? పిలిచింది.. ఎవరో కూడా తెలియదా? వారు నాలుగు గంటలపాటు కొట్టారా? ఆ సోకాల్డ్‌ రైతు టీడీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్‌ పెట్టాడా? పైగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటర్లే లేనట్టు.. ఆయన ఓటు కోసం, పార్టీ మారమన్నారా? నిజం ఏమిటంటే.. రూ.7,500 విలువైన మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడని అరెస్ట్‌ చేస్తే దానికి చక్కటి కథ అల్లారు. ఎవరి కోసం?

వార్తా కథనం- 6
టిడ్కో ఇళ్లు వద్ద 144 సెక‌్షన్‌ అంటూ టీడీపీ, సీపీఐ చేస్తున్న దుష్ప్రచారానికి.. సామూహిక గృహ ప్రవేశాలు అంటూ వారు చేస్తున్న ఆగడానికి వంతపాడారు. ఎవరి ఇంటిలోకి వారు ఒక వేడుకగా, పూజతో గృహప్రవేశం చేయాలనుకుంటారు. టీడీపీని, ముఖ్యమంత్రి పదవిని ఎన్టీఆర్‌ ట్రస్టును, టీడీపీ ఎన్నికల గుర్తును ఇలా అన్నింటినీ లాక్కుని బలవంతంగా కబ్జా చేసిన చంద్రబాబును సమర్ధించే మీరు సొంతింటి యజమానులు వారి ఇళ్లలోకి దర్జాగా వెళ్ళకుండా ఆక్రమించాలన్న పద్ధతిలో వార్తలు ప్రచురించడం టీడీపీ, ఈనాడు సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. చంద్రబాబు కట్టకుండా వదిలేసిన ఇళ్ళను జగన్‌ ప్రభుత్వం పూర్తి చేసి అప్పగించబోతోందని అందరికీ తెలుసు. నిజానికి చంద్రబాబు నాయుడే టిడ్కోకు రూ.3,200 కోట్లు బకాయి పెట్టి దిగిపోయాడన్నది కూడా అందరికీ తెలుసు. ఇందులో 300 చదరపు అడుగుల లోపు ఉన్న ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు అయితే.. అందులో 50 శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిసమానంగా భరించాలి.

మిగతా 3 లక్షలు 20 ఏళ్ళ వరకు వడ్డీలూ, చక్రవడ్డీల సహా చెల్లించుకోవాలి. ఇదీ చంద్రబాబు స్కీము. ఈ మొత్తాన్ని కూడా అంటే మొత్తం రూ.6 లక్షలు అయ్యే ప్రతి ఇంటికి రూ. 4.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వమే భరించి.. మొత్తంగా ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించి, ఆ డాక్యుమెంటును గృహప్రవేశం సమయంలోనే, బహుశా ఈ ఏడాది చివరిలోనే లబ్ధిదారుడి చేతిలో పెట్టబోతోంది. చంద్రబాబు ప్రభుత్వం కడతానన్నా  ఇస్తానన్నా టిడ్కో ఇళ్ళకు సంబంధించి, గృహ నిర్మాణం పూర్తి అయ్యాక చంద్రబాబు స్కీమ్‌లో కేవలం పొసెషన్‌ సర్టిఫికెట్‌ మాత్రమే వస్తుంది. బాకీని 300 చదరపు అడుగుల యజమాని తన జీవితం అంతా కట్టుకుంటూ పోతే, 20 ఏళ్ల తరువాత మాత్రమే పట్టా వస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడ్కో ఇళ్ళ యజమానులు చంద్రబాబు స్కీం ప్రకారం రూ.3 లక్షలు కట్టి 300 అడుగుల ఇల్లు తీసుకుంటారా? లేక జగన్‌గారి స్కీం ప్రకారం ఉచితంగా, ఇప్పుడే పట్టా వచ్చే ఇల్లు ఉచితంగా కావాలంటారా? చంద్రబాబు స్కీమా? లేక జగన్‌గారి స్కీమా? ఏది కావాలని టిడ్కో లబ్ధిదార్ల వద్ద బ్యాలెట్‌ పెడదామా? బ్యాలెట్‌ పెడితే ఏం జరుగుతుంది? అన్నీ అర్థమవుతున్నా చంద్రబాబుకు కొమ్ముగాసేలా వార్తా కథనాలు ప్రచురించటాన్ని మీ వివేచనకే వదిలి వేస్తున్నాం.

‘సామాజిక’ కారణాలు ఉండి ఉండొచ్చు
చంద్రబాబుకు, మీకు ఉన్న బంధం బలమైనది. ఈ రోజు మీ జన్మదిన సందేశంలో పేర్కొన్నట్టు అందుకు ‘ సామాజిక’ కారణాలు కూడా ఉండి ఉండవచ్చు. కానీ అందుకు నిజాలను పణంగా పెట్టి పత్రిక అని పేరుపెట్టి, జర్నలిజం అని ముసుగుకప్పి.. మీ ఉమ్మడి ప్రయోజనాల ఎజెండాను కొనసాగించటం మీదే మా అభ్యంతరం. ఒకే రోజున, మీ పత్రిక మొదటి పేజీలో మీరు ప్రచురించిన ఈ కథనాలన్నీ చూసిన తరువాత, నిత్యం ఉషోదయాన మీ ఈనాడులో సత్యాలు నినదిస్తున్నాయా? అసత్యాలు నినదిస్తున్నాయా? మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాల్సిందిగా విజ్ఙప్తి చేస్తున్నాను.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా