‘వరికెపూడిశెల’కు పర్యావరణ అనుమతులివ్వండి 

28 Jul, 2022 04:24 IST|Sakshi
షెకావత్‌కు జ్ఞాపిక ఇస్తున్న అంబటి, మిథున్‌రెడ్డి

కేంద్ర మంత్రి భూపిందర్‌కు మంత్రి అంబటి వినతి  

సాక్షి, న్యూఢిల్లీ: పల్నాడు ప్రాంతానికి నీరందించే వరికెపూడిశెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపిందర్‌ యాదవ్‌ను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో మంత్రిని కలసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే సంబంధిత డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని తెలిపారు.

పల్నాడు జిల్లా వెల్దుర్తి గంగలగుంట సమీపంలో నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ ముందు ఉన్న నది ప్రాంతాన్ని.. అనేక అధ్యయనాల తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. సాగర్‌ రిజర్వాయర్‌ ఒడ్డున ఉన్న స్థలం, ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ప్రతిపాదిత జాక్‌వెల్‌ పంప్‌ హౌస్‌కు నది నీటి ప్రవాహం 10 మీటర్ల వద్ద ఉందని తెలిపారు. ఇది పంట కాలం అంతటా తగినంత నీరు అందుబాటులో ఉండేందుకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టు కింద 24,900 ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు. పల్నాడు ప్రాంతంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిచ్చి సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. 

జలశక్తి మంత్రితో భేటీ.. 
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో మంత్రి అంబటి భేటీ అయ్యారు. బుధవారం లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్షనేత మిథున్‌రెడ్డితో కలిసి షెకావత్‌ను కలిశారు. మంత్రిగా తొలిసారి ఢిల్లీ వచ్చిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కేంద్ర జలశక్తి మంత్రిని కలిసినట్లు అంబటి చెప్పారు. 

మరిన్ని వార్తలు