సీబీఐ మీద నమ్మకం ఎలా కలిగిందో: అంబటి

10 Sep, 2020 17:06 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అంతర్వేది ఆలయ రథం దగ్ధం కావడం దురదృష్టకరమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. అంబటి రాంబాబు గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అంతర్వేది సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి ఈవోను వెంటనే తొలగించిందని పేర్కొన్నారు. కొత్త రథాన్ని తయారు చేయడం కోసం ప్రభుత్వం 95 లక్షల రూపాయిలు కేటాయించిందని తెలిపారు. దోషులు ఎంతటివారైనా వదిలేదని లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నాయని, మతాలు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. కాగా మంత్రులు సంఘటన స్థలానికి వెళ్ళినప్పుడు కొంతమంది రచ్చ చేయాలని చూసారని, కొన్ని శక్తులు ప్రవేశించి మరొక ప్రార్ధన మందిరం మీద రాళ్లు వేశారని మండిపడ్డారు.

భక్తుల ముసుగులో కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏపీలో జరుగుతున్నాయని, రూ. 60 వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు 6 కోట్ల మందికి అందుతున్నాయని తెలిపారు. కాగా సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రికి  అన్ని కులాలు, మతాలు సమానమేనని తెలిపారు. మరోవైపు తిరుపతి వెళ్లే బస్సు టికెట్లు మీద అన్యమత ప్రచారం చేసి దాన్ని వైఎస్సార్ సీపీ మీద నెట్టే ప్రయత్నం చేసి చంద్రబాబు నవ్వుల పాలయ్యారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు గుర్తు చేశారు. (చదవండి: రథం చుట్టూ రాజకీయం!)

ప్రభుత్వం మీద ఎందుకు నిరసన చేయాలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పాలని అన్నారు. విధ్వంసాలు, విద్వేషాలు సృష్టించింది చంద్రబాబు ప్రభుత్వమేనని, హిందుత్వం గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని ధ్వజమెత్తారు. విజయవాడలో 39 పురాతన దేవాలయాలను కులదోయించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. దైవభక్తి లేని వ్యక్తి చంద్రబాబేనని గతంలో సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదన్న బాబుకు సీబీఐ మీద ఇప్పుడు నమ్మకం ఎలా కలిగిందో చెప్పాలని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని సీబీఐ విచారణ చేయడానికి తమకెలాంటి అభ్యతరం లేదని తెలిపారు. కాగా ఎలాంటి విచారణ జరిపేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అయితే కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, మానవ రూపంలో ఉన్న దెయ్యం చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. (చదవండి: టీడీపీ.. ప్రజల్లో లేని ప్రతిపక్షం)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా