వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పార్టీ నియమావళికి సవరణలు 

5 Jul, 2022 14:22 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి. పక్కన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పక్కన వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పార్టీ నియమావళికి సంబంధించి కొన్ని సవరణలను ప్రతిపాదించి.. వాటిని ఆమోదానికి పెడతామని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే ప్లీనరీలో అనేక అంశాలపై చర్చిస్తామని.. తీర్మానాలు కూడా ఉంటాయన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్లీనరీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లను సోమవారం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కొడాలి నాని, తదితరులతో కలసి విజయసాయిరెడ్డి పరిశీలించారు.

అనంతరం ప్లీనరీ ప్రాంగణం వద్ద విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వక్తలందరూ వివిధ ముఖ్యమైన అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు. ముఖ్యంగా విద్య, వ్యవసాయం, వైద్యం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, మీడియా పక్షపాత వైఖరిపై ప్రసంగిస్తారన్నారు. వాటిపై తీర్మానాలు చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలకు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. ప్లీనరీ జరిగే ఈ నెల 8, 9 తేదీల్లో రెండ్రోజులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభా వేదికపైనే ఉండి వివిధ తీర్మానాలను చర్చించి ఆమోదిస్తారని తెలిపారు. ప్లీనరీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తోందన్నారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందినవారు, సామాజిక న్యాయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదలంతా సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలన పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. ప్లీనరీకి వచ్చేవారికి భోజన ఏర్పాట్లతోపాటు వార్డు సభ్యుల నుంచి పైస్థాయి నాయకుల వరకు అందరికీ అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.    

సీఎం చెప్పే ప్రతి మాట దిక్సూచి:మంత్రి బొత్స 
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ఆయనను స్మరించుకుంటూ పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జూలై 8న పార్టీ జెండా వందనం, అధ్యక్షుడి ప్రారంభ ఉపన్యాసంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. 9వ తేదీ అధ్యక్షుడి ముగింపు ఉపన్యాసంతో సమావేశాలు ముగుస్తాయన్నారు. సమావేశాలకు తరలివచ్చే వారికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పే ప్రతిమాట రాబోయే రెండేళ్లలో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి దిక్సూచిగా ఉంటుందన్నారు. ఆ స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేయడంతోపాటు ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.   

ప్లీనరీని విజయవంతం చేయాలి
వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్లీనరీపై ముఖ్య నేతలతో చర్చించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనేలా చూడాలన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్‌ సభ్యుల వరకు దాదాపు 80 శాతం మంది వైఎస్సార్‌సీపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ప్లీనరీకి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. కాగా ప్లీనరీలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం శిబిరంలో పాల్గొననున్నారు. ఇందుకు అనుగుణంగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను  www. ysrcpblooddonation.com  నేతలు ఆవిష్కరించారు. ప్రతి నియోజకవర్గం నుంచి రక్తదానంపై ఆసక్తి ఉన్న కార్యకర్తలు వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయిన తర్వాత రిజిస్టర్‌ డొనేట్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేసి రక్తదాత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

రక్తదాతల రిజిస్ట్రేషన్‌ కోసం రూపొందించిన వైబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న విజయసాయిరెడ్డి, సజ్జల తదితరులు

మరిన్ని వార్తలు