అమెరికా పింఛనట.. నెలకు రూ.3 వేలట!

29 Dec, 2020 09:16 IST|Sakshi

బాండ్లు ఇచ్చి టోకరా

సబ్‌ కలెక్టరేట్‌ వద్ద బాధితుల ధర్నా

సాక్షి, మదనపల్లె: ఒకసారి రూ.12,000 కడితే జీవితాంతం ప్రతినెలా రూ.3,000 అమెరికా పింఛన్‌ రూపంలో వస్తుందని డబ్బులు కట్టించుకుని నిలువునా మోసం చేశారని తంబళ్లపల్లె మండలం పులసరంవారిపల్లె గ్రామస్తులు సోమవారం సబ్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. బాధితుల కథనం..పెద్దమండ్యం మండలం చెరువుకిందపల్లెకు చెందిన చంద్రప్పనాయుడు కుమారుడు రూపేష్‌కుమార్‌ అమెరికా పింఛన్‌ పేరిట గ్రామంలోని 137 మంది దగ్గర రూ.12,000 చొప్పున రూ.16,44,000 కట్టించుకున్నాడు. దీనికి సంబంధించి బాండ్లను అందజేశాడు.

కట్టిన డబ్బులో కొంతమందికి నెలనెలా కంతుల రూపంలో రూ.5,94,700 వరకు చెల్లించాడు. మిగిలిన సొమ్ము రూ.10,46,600కు సంబంధించి ఏడాదిన్నరగా అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేశాడు. డబ్బు విషయమై నిలదీస్తే ఈ ఏడాది ఆగష్టు 8న తాను ఇచ్చిన బాండ్లను తీసుకురావాలని, అందులో పెయిడ్‌ అని రాసి 11, 12 తేదీల్లో ఖాతాలకు డబ్బు చేస్తానని చెప్పాడట! దీంతో నిజమేనని నమ్మి అతను చెప్పినట్లే చేశారు. తీరా అతను గ్రామం నుంచి పరారయ్యాడు. దీంతో బాధితులు గొల్లుమన్నారు. తాము మోసపోయామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సబ్‌ కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి తమ డబ్బులు ఇప్పించాలని సబ్‌ కలెక్టరేట్‌ ఏఓ షంషేర్‌ఖాన్‌కు వినతిపత్రం సమర్పించారు. (చదవండి: స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు)

మరిన్ని వార్తలు