ఆంగ్లంపై ఏపీ చర్యలు భేష్‌

1 Nov, 2022 04:08 IST|Sakshi
జెన్నిఫర్‌ను సత్కరిస్తున్న వీసీ ప్రసాదరెడ్డి

అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌

ఏయూ విద్యార్థులతో ఇష్టాగోష్టి

విశాఖపట్నం (ఏయూ క్యాంపస్‌): ఆంగ్ల భాషను అందరికీ చేరువ చేసేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ (హైదరాబాద్‌) జెన్నిఫర్‌ లార్సన్‌ అన్నారు. సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఆమె అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆంగ్ల భాషను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు వంటివి అందిస్తోందా అని ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డిని అడిగారు.

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అత్యధిక శాతం విద్యార్థులకు కళాశాల రుసుములను, హాస్టల్‌ చార్జీలను జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా చెల్లిస్తోందని వివరించారు. ఏయూలో ఇంక్యుబేషన్, స్టార్టప్‌లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. భారత్, అమెరికా దేశాల విద్యార్థులు స్టార్టప్‌ రంగాలలో పరస్పరం కలసి పనిచేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటైందన్నారు. ఏడాది కాలంలో ముప్‌పైకి పైగా కార్యక్రమాలను అమెరికన్‌ కార్నర్‌ నిర్వహించడాన్ని జెన్నిఫర్‌ ప్రశంసించారు. ఏయూలో 58 దేశాలకు చెందిన వెయ్యి మందికిపైగా విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌ వివరించగా, అత్యధికంగా విదేశీ విద్యార్థులను కలిగి ఉండటంతో జెన్నిఫర్‌ హర్షం వ్యక్తం చేశారు. 

విద్యార్థులతో మాటామంతి
గ్లోబల్‌ వర్చువల్‌ స్కూల్‌ ఇంగ్లిష్‌ ప్రోగ్రాంలో భాగంగా ఆంగ్ల భాషలో తర్ఫీదు పొందుతున్న విద్యార్థులతో జెన్నిఫర్‌ లార్సన్‌ అమెరికన్‌ కార్నర్‌లో సమావేశమయ్యారు. తరగతులు జరుగుతున్న విధానం, విద్యార్థుల ప్రగతిపై ఆరా తీశారు. అమెరికన్‌ కార్నర్‌లో నిర్వహించిన కార్యక్రమాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు తదితర వివరాలు పాలకమండలి సభ్యుడు జేమ్స్‌ స్టీఫెన్‌ వివరించారు. రెక్టార్‌ కె.సమత, రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్, ప్రిన్సిపాల్స్‌ కె.శ్రీనివాసరావు, వి.విజయలక్ష్మి, టి.శోభశ్రీ, ఎస్‌కే భట్టి, డీన్‌లు ఎన్‌.కిశోర్‌బాబు, కె.బసవయ్య పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు