అమ్మ ఒడి, వాహన మిత్ర రద్దు ప్రచారం పూర్తిగా అవాస్తవం

31 May, 2022 04:31 IST|Sakshi

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే దుష్ప్రచారం చేస్తున్నారు

వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయి

సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, అమరావతి: జగనన్న అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2022 ఏడాదికి గాను ప్రభుత్వం రద్దు చేసిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో ఈ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో అటువంటి శాఖ అసలు మనుగడలోనే లేదని పేర్కొన్నారు.

ప్రజల్లో గందరగోళం నెలకొల్పి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావటమే లక్ష్యంగా ఇలాంటి ఫేక్‌ వార్తలను సృష్టించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీని వెనుక ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్‌ వార్తలను, పుకార్లను పుట్టించే వారిపైనా, వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేసి దుష్ప్రచారం చేసే వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.

సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మరీ ఏ నెలకు ఆ నెల సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను ప్రజలెవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు