ఇటు పాల వెల్లువ.. అటు మహిళా సాధికారత 

26 Jul, 2020 02:51 IST|Sakshi

రాష్ట్రంలో పాడి పరిశ్రమ ఇక కొత్తపుంతలు

ప్రభుత్వం– అమూల్‌ ఎంవోయూతో సహకార డెయిరీలకు జవసత్వాలు

రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా పాల సేకరణ కేంద్రాలు

త్వరలో 7 వేల గ్రామాల్లో మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు 

పశువుల పెంపకం, డెయిరీల నిర్వహణలో మహిళలకు అపార అవకాశాలు 

సీఎం వైఎస్‌ జగన్‌ కృషితో రాష్ట్రానికి అమూల్, పశువుల వ్యాక్సిన్‌ కంపెనీలు

పశుపోషకులకు మంచి ధర, వినియోగదారులకు నాణ్యమైన పాల ఉత్పత్తులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌ (ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌)తో ఏర్పాటు చేసుకున్న అవగాహన ఒప్పందం పశు పోషకులు, ముఖ్యంగా మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులకు, సహకార డెయిరీలకు జవసత్వాలు కలిగించనుంది. పశు పోషణ రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం కీలకమైంది.  

► గత ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం హెరిటేజ్‌ డెయిరీని ప్రోత్సహిస్తూ సహకార డెయిరీలను నిర్వీర్యం చేసింది. గతంలో 3 లక్షల నుంచి 4 లక్షల లీటర్ల పాలను సేకరించిన సహకార డెయిరీలు ఇప్పుడు కేవలం 30 వేల లీటర్లు మాత్రమే సేకరిస్తున్నాయి. పశు పోషకులు మరో మార్గం లేక హెరిటేజ్‌కు అందుబాటులో ఉన్న ప్రైవేట్‌ డెయిరీలకు పాలను విక్రయించారు.   
► వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పశు పోషణ, ప్రైవేట్, సహకార రంగంలోని డెయిరీలపై  నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ)తో అధ్యయనం చేయించింది. అనంతరం పాల ఉత్పత్తి, అమ్మకాల్లో ప్రఖ్యాతిగాంచిన అమూల్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. 
► రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా పాలసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.   
► రాష్ట్ర సహకార శాఖకు చెందిన ఒక అధికారిని ఒక్కో జిల్లాకు బాధ్యునిగా ప్రభుత్వం నియమించనుంది. వీరు ఆయా జిల్లాల్లో మహిళలతో కూడిన పాల ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తారు. 
► ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పులివెందులలోని ఏపీకార్ల్‌లో వాక్సిన్‌ తయారీకి తెలంగాణాకు చెందిన కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. వచ్చే ఏడాది పశు వాక్సిన్‌ అందుబాటులోకి రానుంది.   

మళ్లీ మునుపటి రోజులొస్తున్నాయి 
పశుక్రాంతి పథకాన్ని దివంగత మహానేత వైఎస్సార్‌ అమలు చేసి మమ్మల్ని ఆదుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పశువులను తెచ్చుకుని బాగా బతికాం. ఆయన తదనంతరం ప్రభుత్వం నుంచి సహకారం లేక దెబ్బతిన్నాం. ఇప్పుడు సీఎం జగన్‌ వల్ల మళ్లీ మునుపటి రోజులొస్తున్నాయి.      
– పడమటి వీర్రాజు, కౌతవరం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా

ఒకప్పుడు బిందెతో తీసుకెళ్లేవాడిని 
ప్రైవేట్‌ డెయిరీలు పాలకు మంచి ధర ఇవ్వడం లేదు. కాయకష్టం చేసుకునే మమ్మల్ని దోచుకుంటున్నాయి. ఒకప్పుడు బిందెతో పాలను తీసుకువెళ్లిన నేను ఇప్పుడు చెంబుతో కేంద్రానికి పాలను తీసుకువెళుతున్నాను. అమూల్‌తో మాకు మంచి రోజులు వస్తాయి.  
– ఎన్‌.రంగారెడ్డి, గోవర్ధనగిరి గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా

రైతులకు శాశ్వత ఆదాయం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతులకు శాశ్వతంగా ఆదాయం వచ్చేందుకు అనువుగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దిశగా అమూల్‌ను ఎన్నుకోవడం మంచి పరిణామం. కేవలం రైతుల నుంచి పాల సేకరణకే పరిమితం కాకుండా వారితో అమూల్‌ మంచి సంబంధాలు కొనసాగిస్తుందని భావిస్తున్నాం.   
– ఆడారి ఆనంద్,  విశాఖ డెయిరీ సీఈవో  

తక్కువ ధరకు పాల ఉత్పత్తులు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక పాడి రైతులకు మేలు చేకూర్చేందుకు చాలా తపన పడ్డారు. మా అంచనాలకు మించి అమూల్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడి పరిస్ధితులకు అనుగుణంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే సామర్థ్యం ఆ సంస్థకు ఉంది. మొత్తంగా నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు మార్కెట్‌లో తక్కువ ధరకు లభ్యం అవుతాయి.   
– బొల్లా బ్రహ్మనాయుడు, వల్లభ డెయిరీ చైర్మన్‌

అమూల్‌తో లాభాలెన్నో..
సహకార డెయిరీల్లోని పరికరాల పర్యవేక్షణను అమూల్‌ తీసుకునే అవకాశం ఉంది. తద్వారా ఆస్తులకు రక్షణ, ఉద్యోగులకు భద్రత చేకూరనుంది. మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు పాల సేకరణ, పశుపోషణపై శిక్షణ ఇవ్వనుంది. పాలను విక్రయించే సభ్యులకు మంచి ధర.. సకాలంలో చెల్లించనుంది. పశువులకు ఉచిత వైద్యం, పోషక విలువలు కలిగిన మేతను అందించనుంది. వినియోగదారులకు స్వచ్ఛమైన, పాలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి.

స్వయం సమృద్ధి దిశగా మహిళల అడుగులు
వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల కింద మహిళా లబ్ధిదారులకు ఏటా రూ.11 వేల కోట్ల చొప్పున నాలుగు సంవత్సరాల్లో రూ.44 వేల కోట్లను అందించనుంది. ఈ మొత్తాన్ని మహిళలు పాడి పశువుల కొనుగోలుకు వినియోగించుకోవచ్చు. తద్వారా స్వయం సమృద్ధి సాధించవచ్చు. సాలీనా రూ.52 వేల కోట్ల టర్నోవర్‌ కలిగిన అమూల్‌ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడం వల్ల రాష్ట్రంలో పాల సేకరణ పెరిగి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడనుంది.

జీవన ప్రమాణాలు మెరుగవుతాయి
పశు పోషణ ద్వారా మహిళా పాల ఉత్పత్తిదారుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందించనున్న ఆర్థిక సాయంతో మహిళలు గేదెలు, ఆవులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. పశుపోషణ లాభసాటిగా మారనుంది. మహిళా సాధికారతకు బాటలు వేయనుంది.  –వాణీ మోహన్, ఏపీడీడీసీఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు