‘అమూల్‌’ శిక్షణా తరగతులు

13 Aug, 2020 09:49 IST|Sakshi

రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించనున్న సంస్థ

తొలిదశలో 7 వేల సంఘాలకు శిక్షణ

అధికారులకు గుజరాత్‌లోనూ, పాల ఉత్పత్తిదారులకు ఆన్‌లైన్‌లోనూ శిక్షణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడిపరిశ్రమకు జవసత్వాలు కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన అమూల్‌ (ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌)తో ఎంవోయూ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థ రాష్ట్రంలో తన కార్యక్రమాలను ప్రారంభించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తొలిదశలో 7వేల పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలను ఏర్పాటు చేయడానికి సహకార శాఖలోని డెప్యూటి రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారులను ఎంపిక చేసింది. వీరికి పాల ఉత్పత్తి, సేకరణ, మార్కెటింగ్‌ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు అమూల్‌ చర్యలు తీసుకుంటోంది. (ఇటు పాల వెల్లువ.. అటు మహిళా సాధికారత)

  • ఎంపికైన అధికారులను రెండు, మూడు బృందాలుగా గుజరాత్‌లోని అమూల్‌ కేంద్రానికి శిక్షణకు పంపనుంది. పది నుంచి ఇరవై రోజులపాటు వీరంతా అక్కడ శిక్షణ పొందనున్నారు.  
  • అక్కడ శిక్షణ పొందిన అధికారులు ఒక్కో జిల్లాకు 15 పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలకు శిక్షణ ఇస్తారు. వీరంతా తమ పరిధిలోని మిగిలిన సభ్యులకు శిక్షణ ఇస్తారు. 
  • రెండు, మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన 7వేల పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలకు శిక్షణ పూర్తి చేస్తారు.
  • తొలుత శిక్షణ పొందిన 15 మహిళా సంఘాలకు ముఖాముఖి, మిగిలిన సభ్యులకు గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.
  •  ఆ తర్వాత అమూల్‌కు చెందిన ఉన్నతస్థాయి బృందం రాష్ట్రంలో పర్యటించి సహకార డెయిరీలు, ఉద్యోగులు, యాంత్రిక పరికరాలను పరిశీలిస్తుంది. 
  • రాష్ట్రంలోని పాడిపరిశ్రమ స్థితిగతులు, పశు సంపద, ప్రైవేట్‌ డెయిరీల కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంది. 
  • భవిష్యత్‌లో చేపట్టనున్న కార్యక్రమాలపై వ్యూహరచనకు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించనుందని ఏపీ డీడీసీఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వాణీమోహన్‌ తెలిపారు. 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా