ఇది ఆంధ్రప్రదేశ్‌ పాడి రైతుల అదృష్టం

5 Jun, 2021 03:10 IST|Sakshi

పాడి పరిశ్రమ సామర్థ్యాన్ని గుర్తించిన సీఎం వైఎస్‌ జగన్‌ 

పాల ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ

ఏటా రూ.7 వేల కోట్ల మార్కెట్‌

అమూల్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోధి 

సాక్షి, అమరావతి: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా పాడి పరిశ్రమ సామర్థ్యాన్ని సరిగ్గా గుర్తించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలో సీఎంగా ఉండటం అక్కడి పాడి రైతుల అదృష్టమని అమూల్‌ ఎండి ఆర్‌ఎస్‌ సోధి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న పాలవెల్లువలో భాగంగా ఏపీ– అమూల్‌ పాలసేకరణను శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ పాడి రైతుల కష్టాలను స్వయంగా గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా అమూల్‌ను ఆహ్వానించడం సంతోషకరమని అన్నారు. భారతదేశంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఐదో స్థానంలో గుజరాత్‌ ఉందని వివరించారు. ఏపిలో రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, వీటి విలువ ఏడాదికి రూ.7 వేల కోట్లు అని చెప్పారు. గుజరాత్‌లో ఏ విధంగా అమూల్‌ వల్ల పాడి రైతులకు మేలు జరిగిందో, ఏపీలో అలాగే మేలు జరుగుతోందని అన్నారు.

అమూల్‌కు లాభాలు ముఖ్యం కాదు
అమూల్‌ సంస్థకు రైతులే నిజమైన యజమానులని, ఇతర కార్పొరేట్, మల్టీనేషన్‌ కంపెనీల మాదిరిగా లాభాలను మాత్రమే ఆర్జించడం అమూల్‌ లక్ష్యం కాదని సోధి అన్నారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో అన్ని జిల్లాల్లోనూ మహిళా రైతుల భాగస్వామ్యంతో సహకార వ్యవస్థ ద్వారా పాల సేకరణ జరుగుతుందని వివరించారు. నాణ్యమైన పాలు, ఇతర ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రజలకు చేరువ చేస్తామని చెప్పారు. ఇందుకోసం అమూల్‌ ఈ రంగంలో ఉన్న నైపుణ్యాలను రైతులకు పంచుతుందని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో నాణ్యమైన పాలు ఉత్పత్తి అవుతాయని, మార్కెట్‌లో ఈ పాలకు మంచి ఆదరణ ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో పాడి రైతుల సహకార సంస్థ చేతుల్లోనే యాబై శాతం మార్కెట్‌ ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

పాడి రైతుల కళ్లలో ఆనందం 
మహిళా రైతులు మాట్లాడిన భాష నాకు తెలియకపోయినా, వారి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ ప్రారంభించాం. దేశంలోనే అమూల్‌కు ప్రజల్లో మంచి గుర్తింపు రావడానికి కారణం అమూల్‌ కొనసాగిస్తున్న నాణ్యతా ప్రమాణాలు. అలాగే పాడి రైతులకు మరింత మేలు చేయాలన్న లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాడిరైతులతో కలిసి అమూల్‌ నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తుంది. అమూల్‌ తో కలిసి పని చేసే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూర్చడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. 
– పటేల్, సబర్‌ డెయిరీ ఎండీ  

మరిన్ని వార్తలు