పొంగిన పాల సేకరణ ధర

11 Sep, 2022 06:03 IST|Sakshi

నాలుగోసారి పెంచిన అమూల్‌  

పాడి రైతుకు మరింత లబ్ధిచేకూర్చేలా నిర్ణయం 

గేదె పాలపై గరిష్టంగా లీటర్‌కు రూ.3.93 చొప్పున పెంపు 

200 లీటర్లు పాలుపోసే రైతులతో పాటు సొసైటీలకు ప్రత్యేక ఇన్సెంటివ్‌ 

లీటర్‌పై రైతులకు రూ.2.25లు, సొసైటీలకు రూ.పావలా చొప్పున ప్రోత్సాహం 

అమూల్‌తో పోటీపడి పాలసేకరణ ధరలు పెంచుతున్న ప్రైవేటు డెయిరీలు

సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాలను సేకరిస్తున్న అమూల్‌ సంస్థ తాజాగా నాలుగోసారి పాలసేకరణ ధరను పెంచింది. ఇటీవలే ఆవుపాలపై లీటర్‌కు గరిష్టంగా రూ. 4.12 చొప్పున పెంచగా, తాజాగా గేదె పాలపై రూ.3.93 పెంచింది. అంతేకాక.. పాలుపోసే రైతులతోపాటు సొసైటీలకు అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించింది. నెలకు 200 లీటర్లకు పైబడి పాలుపోసే రైతులకు రూ.2.50 వరకు అదనపు ప్రయోజనం చేకూర్చనుంది. మహిళా పాడిరైతు సంఘాల కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు ప్రత్యేక ప్రోత్సాహం కింద లీటర్‌కు పావలా చొప్పున ఇవ్వనున్నారు. ఆదివారం నుంచి ఈ పెంపు, ప్రోత్సాహకాలు అమలులోకి రానున్నాయి. 

20 నెలల్లో రూ.181.90 కోట్ల చెల్లింపు 
‘జగనన్న పాలవెల్లువ’ కింద 2020 డిసెంబర్‌లో మూడు జిల్లాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టగా, 20 నెలల్లో 15 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించారు. 2,344 గ్రామాల్లో 2,34,548 మంది నమోదు కాగా, రోజుకు 1.06 లక్షల మంది పాలుపోస్తున్నారు. ఇప్పటివరకు 4.20 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.181.90 కోట్లు చెల్లించారు.

అమూల్‌ తరఫున రాయలసీమలో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్‌ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇక విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ట్రయిల్‌ రన్‌ నిర్వహిస్తుండగా.. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సర్వే జరుగుతోంది. వీటితో పాటు మిగిలిన అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, శ్రీబాలాజీ జిల్లాల్లో డిసెంబర్‌లోగా విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

నాలుగోసారి పాలసేకరణ ధర పెంపు 
పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌ (వెన్నలేని ఘన పదార్థాలు)తో గేదె పాలకు రూ.71.47లు, 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించిన అమూల్‌ సంస్థ గడిచిన 20 నెలల్లో మూడుసార్లు పాలసేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతంు లీటర్‌ గేదె పాలకు గరిష్టంగా రూ.80.22, ఆవుపాలకు రూ.37.90 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా అమూల్‌ తరఫున ఉత్తరాంధ్రాలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్‌ జిల్లా కోఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌ నాలుగోసారి పాల సేకరణ ధర పెంచింది.

ఇటీవలే ఆవు పాలకు లీటర్‌పై గరిష్టంగా రూ.4.12ల చొప్పున పెంచిన యూనియన్, తాజాగా గేదె పాలపై లీటర్‌కు రూ.3.93 చొప్పున పెంచింది. దీంతో గరిష్టంగా ఆవుపాల ధర లీటర్‌ రూ.40.73లకు చేరగా, తాజాగా గేదె పాలు ధర లీటర్‌కు రూ.84.15కు చేరనుంది. అమూల్‌ సంస్థ గడిచిన 20 నెలల్లో గేదె పాలపై రూ.12.68, ఆవు పాలపై రూ.6.53ల మేర పెంచింది. 

పాడి రైతులకు ప్రోత్సాహకాలు 
పాల సేకరణ ధర, రాయల్టీ బోనస్‌ కాకుండా పాలుపోసే రైతులతో పాటు సొసైటీ నిర్వాహకులకు అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాలను ప్రతీనెలా 7వ తేదీన  చెల్లించనుంది. పాలుపోసే సామర్థ్యాన్ని బట్టి లీటర్‌కు రూ.0.75 నుంచి రూ.2.25ల వరకు రైతులకు ప్రోత్సాహకాలను అందించనుంది. ఇక సొసైటీ కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు సైతం లీటర్‌పై పావలా రాయితీని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధంగా ప్రతీ సొసైటీ పరిధిలో ఒక రూపాయి నుంచి రూ.2.50 వరకు అదనపు ప్రోత్సాహం అందుకోనున్నారు. 

ప్రైవేటు డెయిరీల పరిధిలో.. 
ఇక అమూల్‌ రాకతో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం పాలసేకరణ ధరను విధిగా పెంచాల్సి వచి్చంది. ఫలితంగా వాటికి పాలుపోసే పాడి రైతులకు అదనపు మేలు చేకూరింది. గతంలో ఎన్నడూలేని రీతిలో లీటర్‌పై రూ.12 నుంచి రూ.15ల వరకు ఆయా డెయిరీలు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా 20 నెలల్లో ఏకంగా రూ.2,020.46 కోట్ల మేర రైతులకు అదనపు లబ్ధిచేకూరినట్లుగా అంచనా వేశారు. 

20 నెలల్లో నాలుగోసారి పెంపు.. 
జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్‌ తరఫున ఉత్తరాంధ్రలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్‌ యూనియన్‌ నాలుగోసారి పాలసేకరణ ధరను పెంచడంతోపాటు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. తాజా పెంపుతో సుమారు 40వేల మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 15 జిల్లాల్లో పాలు సేకరిస్తున్నాం. డిసెంబర్‌ నెలాఖరుకల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. 
– అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ 

మరిన్ని వార్తలు