361 రోజులు.. 29 వేల కిలోమీటర్లు

22 Nov, 2020 03:17 IST|Sakshi

అమూర్‌ డేగ జంట అద్భుత ప్రయాణం 

మణిపూర్‌ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లి తిరిగి వచ్చిన పక్షులు

ఐదు పక్షులకు శాటిలైట్‌ రేడియో ట్రాన్స్‌మిటర్లు

సాక్షి, అమరావతి: వలస పక్షుల సుదీర్ఘ ప్రయాణాలు సాధారణ విషయమే. కానీ రెండు అమూర్‌ డేగలు (అమూర్‌ ఫాల్కన్స్‌) ఏకంగా రెండు మహా సముద్రాలను దాటి, పదికిపైగా దేశాలను చుట్టి 29 వేల కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించాయి. వాటికి అమర్చిన శాటిలైట్‌ రేడియో ట్రాన్స్‌మీటర్ల ద్వారా పరిశోధకులు ఆ పక్షుల రూట్, ప్రయాణించిన దూరాన్ని తెలుసుకున్నారు. ఆర్కిటిక్‌ టెర్న్‌ తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ దూరం ప్రయాణించిన పక్షులుగా ఇవి ఇప్పుడు గుర్తింపు పొందినట్లు చెబుతున్నారు. అమూర్‌ డేగల వలస మార్గం, ప్రయాణం గురించి అధ్యయనం చేయడానికి సైబీరియాలోని అమూర్‌ నుంచి మణిపూర్‌ వచ్చిన ఐదు పక్షులకు గతేడాది నవంబర్‌ 2న వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, మణిపూర్‌ ఫారెస్ట్‌ శాఖ సంయుక్తంగా శాటిలైట్‌ రేడియో ట్రాన్స్‌మిటర్లు అమర్చింది. వాటికి చ్యులాన్, ఇరాంగ్, బారక్, ఫలాంగ్, పుచింగ్‌ అని పేర్లు పెట్టారు. బారక్, ఫలాంగ్, ఫుచింగ్‌ల నుంచి సిగ్నల్‌ రావడం చాలా కాలం క్రితమే ఆగిపోవడంతో అవి చనిపోయినట్లు భావించారు. కానీ చ్యులాన్, ఇరాంగ్‌ నుంచి నిరంతరం సిగ్నల్స్‌ వచ్చాయి. ఆడ పక్షి చ్యులాన్‌ 29 వేల కి.మీ. ప్రయాణించి తన వలస మార్గాన్ని (361 రోజుల్లో) పూర్తిచేసి ఇటీవలే మణిపూర్‌లో తన తాత్కాలిక స్థావరానికి చేరుకుంది. మగ పక్షి ఇరాంగ్‌ 33 వేల కి.మీ. ప్రయాణించి తర్వాత అక్కడకు చేరింది.

డేగల రూట్‌ ఇదే.. 
► చైనా నుంచి బయలుదేరి థాయ్‌లాండ్, మయన్మార్‌ మీదుగా మన దేశంలోని మణిపూర్‌లోకి వచ్చాక వాటికి జియో ట్యాగ్‌లు అమర్చారు. వాటి సిగ్నల్‌ ఆధారంగా బంగాళాఖాతం తీరంలో మన దేశంలోని ఏపీ, కర్ణాటక పలు ప్రాంతాల నుంచి అరేబియా సముద్రం దాటి ఆఫ్రికా ఖండంలోని సోమాలియా, కెన్యా, టాంజానియా, జాంబియా, జింబాబ్వే, బొట్స్‌వానా మీదుగా దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ శీతాకాల విడిది చేశాయి. మళ్లీ తిరిగి ఇదే రూట్‌లో మణిపూర్‌ చేరుకున్నాయి. తర్వాత ఇవి చైనా, రష్యా ప్రాంతానికి వెళ్లిపోయాయి.
► అమూర్‌ డేగలు నాగాలాండ్‌ ప్రాంతానికి లక్షల్లో వలస వస్తాయి. శీతాకాలంలో ఆ ప్రాంతంలోని అడవులు, పంటల్లో చెదలు, క్రిమి కీటకాలను ఇవి తినేవి. అయితే స్థానికులు పెద్దఎత్తున వేటాడడంతో వాటి రాక తగ్గిపోయింది. దీనివల్ల పంటలు, అడవులు క్రిమి కీటకాలతో నాశనమవుతున్నట్లు గుర్తించి వేటాడడం నిలిపివేశారు. 
► అప్పటి నుంచి మళ్లీ అమూర్‌ డేగలు వస్తుండడంతో వారికి క్రిమి సంహారక మందులు వాడాల్సిన అవసరం ఉండడంలేదని చెబుతున్నారు. ఇప్పుడు నాగాలాండ్‌కు అమూర్‌ డేగలు వచ్చే సమయంలో పండుగ నిర్వహిస్తున్నారు. వాటిని చూడ్డానికి పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారు. 

గుంపులుగానే ప్రయాణం
► కంటి పాచ్‌ నల్లగా ఉంటుంది. కంటి చుట్టూ ఆరెంజ్‌ రంగు వలయం ఆకర్షణీయంగా ఉంటుంది. 
► గుండ్రని వంపు గల రెక్కలు ఉంటాయి. అత్యంత స్నేహశీలి. సంధ్యా సమయంలో చాలా చురుగ్గా ఉంటుంది.
► కాళ్లు, పాదాలు.. ఎరుపు, ఆరెంజ్‌ రంగుల మేళవింపుతో ఉంటాయి. చిన్నపాటి తోక కలిగి ఉంటాయి.
► మధ్య, తూర్పు హిమాలయాల్లో.. దక్షిణ అస్సాం కొండలు, శ్రీలంక,భారతదేశంలోని సముద్రతీరం, మాల్దీవులు, ఈశాన్య ఆసియా,ఆగ్నేయ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. 
► గుంపులుగా కలిసి వలస వెళ్తాయి. ఒక్కో సారి ఇతర జాతుల పక్షులతో కలిసి కూడా ప్రయాణిస్తాయి. చెట్ల పొదలను ఇష్టపడతాయి.
► గడ్డిభూములు, చిత్తడి నేలలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. చెట్ల రంధ్రాలు, పాత గూళ్లలో విశ్రాంతి తీసుకుంటాయి. ఎరుపు రంగును చూస్తే ఆందోళనకు గురవుతాయి. 

మగ డేగ
ముదురు బూడిద, ఎరుపు రంగులో ఉంటుంది. రెక్కల వెనుక భాగం తెల్లగా ఉంటుంది. తొడల భాగం గోధుమ వర్ణంలో ఉంటుంది. కడుపు భాగంలో నల్లటి మచ్చలు ఉంటాయి. 

ఆడ డేగ
పై భాగం లేత బూడిద రంగులో ఉంటుంది. నుదుటి భాగం క్రీమ్‌ కలర్‌లో ఉంటుంది. ఛాతీ భాగంలో తెలుపు, బూడిద రంగులో పెద్ద మచ్చలు ఉంటాయి. తోక, ఈకలు కొంచెం నలుపు రంగులో ఉంటాయి. 

పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి
అమూర్‌ డేగలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. క్రిములను తిని బతికే పక్షుల్లో అత్యధిక దూరం ప్రయాణించేవి ఇవే. ఆగకుండా నాలుగైదు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. మన రాష్ట్రం ఈ పక్షుల వలస మార్గం. తిరుపతి, విశాఖలో గతంలో కనిపించాయి. మచిలీపట్నంలోనూ దీన్ని గుర్తించారు. నైరుతి రుతు పవనాలు, సముద్రంలో ఏర్పడే అల్ప పీడనాలను ఉపయోగించుకుని ఇవి ప్రయాణిస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. వీటిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది.     
– రాజశేఖర్‌ బండి,సిటిజన్‌ సైన్స్‌ కో–ఆర్డినేటర్, ఐఐఎస్‌ఈఆర్‌

మరిన్ని వార్తలు