కులాల మధ్య చిచ్చుకే.. పవన్‌ పర్యటన

21 Aug, 2022 03:45 IST|Sakshi
మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

45 వేల బెల్టు షాపులను రద్దుచేసింది మా ప్రభుత్వమే 

వైఎస్‌ జగన్‌ వారసత్వంగా ముఖ్యమంత్రి కాలేదు 

సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకొచ్చారు 

పవన్‌ ఎవరి పేరు వాడుకుని రాజకీయాలు చేస్తున్నాడో అందరికీ తెలుసు 

చంద్రబాబును సీఎం పదవిలో కూర్చోబెట్టడమే ఆయన అజెండా  

డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, మేయర్‌ సురేష్‌బాబు ధ్వజం

కడప కార్పొరేషన్‌: తన స్వప్రయోజనాల కోసం వైఎస్సార్‌ జిల్లాలో కులాల మధ్య చిచ్చు రేపేందుకే పవన్‌కళ్యాణ్‌ పర్యటించారని ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాషా విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్‌ కె. సురేష్‌బాబుతో కలిసి శనివారం అంజద్‌ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా వైఎస్‌ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారన్న విషయాన్ని పవన్‌ గుర్తుంచుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నామని, రైతులు విత్తు వేసినప్పటి నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకూ ప్రభుత్వం వారికి అండగా ఉంటోందన్నారు.

పద్యం పుట్టిన చోట మద్యం ఏరులై పారుతోందని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అంజద్‌ బాషా ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45వేల బెల్టుషాపులను రద్దుచేసిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ వారసత్వ రాజకీయాలు చేయడంలేదని, కాంగ్రెస్‌ ఇచ్చిన కేంద్రమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశారన్నారు. ఇక పవన్‌ ఎవరి పేరు వాడుకుని రాజకీయాలు చేస్తున్నాడో గుర్తుచేసుకోవాలని చెప్పారు. 14 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ కేవలం ఒక్క ఎమ్మెల్యేనే గెలిపించుకున్నావని.. అందుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. 

అప్పుడెందుకు ప్రశ్నించలేదు.. 
ప్రశ్నించడానికే వచ్చానని చెప్పుకుంటున్న పవన్‌ 2014కు ముందు ఎంతోమంది రైతులు అప్పులపాలై చనిపోతే ఎందుకు ప్రశ్నించలేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. కులాల ప్రస్తావన తేవడం బాబు, పవన్‌ ఆడుతున్న నాటకంలో భాగమేనన్నారు. కులాల మధ్య చిచ్చురేపేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని అంజద్‌ బాషా హెచ్చరించారు. తన వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా చంద్రబాబుకు బదిలీచేసి ఆయన్ను సీఎం చేయడమే పవన్‌ ఎజెండా అని ఆరోపించారు. పవన్‌కళ్యాణ్‌ రాయలసీమకు ఏం చేశారో, ఈ ప్రాంత అభివృద్ధిపై ఆయన ప్రణాళిక, వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.   

ఒంటరిగా పోటీచేసే దమ్ముందా పవన్‌.. 
మేయర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ తన సామాజిక వర్గం వారున్నారనే పవన్‌ సిద్ధవటంలో సభ పెట్టారన్నారు. టక్కోలు పంచాయతీ, డేగల వాండ్ల పల్లెలో శిరిగిరెడ్డి సాంబశివారెడ్డి అనే వ్యక్తి అప్పులతో చనిపోయాడని, వారి కుటుంబానికి ప్రభుత్వం రూ.7లక్షల పరిహారం ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా,  ప్రభుత్వంపై పవన్‌ విమర్శలు చేయడం అవివేకమన్నారు.

కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు మెచ్చుకుని, అక్కడ అమలుచేస్తుంటే ఇక్కడి ప్రతిపక్షాలకు కడుపుమంటగా ఉందన్నారు. ఇక జగన్‌ వారసత్వంగా సీఎం కాలేదని,  సొంతంగా పార్టీ పెట్టి, సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకొచ్చారన్నారు. ఒంటరిగా పోటీచేసే దమ్ము, ధైర్యం పవన్‌కు ఉందా అని సురేష్‌బాబు సవాల్‌ విసిరారు. 

మరిన్ని వార్తలు