స్పందనేది ‘బాబూ’!

8 Oct, 2023 04:28 IST|Sakshi

చంద్రబాబుపై కనిపించని సానుభూతి 

కాంతితో క్రాంతి కార్యక్రమానికీ స్పందన కరువు 

బాబు అరెస్టుతో సానుభూతి పొందాలని టీడీపీ ప్రయత్నాలు 

పట్టించుకోని ప్రజలు, పార్టీ కార్యకర్తలు 

టీడీపీ ఎన్ని కార్యక్రమాలు చేసినా అన్నీ విఫలం 

బాబు అవినీతి చేశారని ప్రజలు నమ్ముతున్నారంటున్న విశ్లేషకులు 

అందుకే టీడీపీ పిలుపునకు స్పందించడంలేదని వెల్లడి  

సాక్షి, అమరావతి : చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఏమాత్రం స్పందన కనిపించడంలేదు. తమ నాయకుడిని అరెస్టు చేసిన తర్వాత ప్రజల నుంచి సానుభూతి వెల్లువెత్తుతోందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నా, అది ఎక్కడా మచ్చుకైనా కనిపించడంలేదు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ పలు కార్యక్రమాలు ప్రకటించి, వాటిలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిస్తున్నా, స్పందన ఉండటంలేదు. ప్రజలే కాదు.. ఆ పార్టీ శ్రేణుల్లోనూ స్పందన కరవైంది. శనివారం రాత్రి కూడా కాంతితో క్రాంతి అంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమమూ విఫలమైంది.

రాత్రి 7 గంటలకు ప్రజలంతా ఇళ్లలో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలపాలని టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు అసలు పట్టించుకునే లేదు. ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతోందనే  విషయం కూడా చాలామందికి తెలియదు. రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, ఢిల్లీలో లోకేశ్, అక్కడక్కడ కొందరు నేతలు, కొంతమంది మద్దతుదారులు ఇళ్లలో లైట్లు ఆర్పి, కొవ్వొత్తులు వెలిగించి సోషల్‌ మీడియాలో హంగామా చేశారు తప్ప ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా స్పందించలేదు.

అవినీతి చేసినందువల్లే చంద్రబాబు అరెస్టయి జైలుకు వెళ్లారని జనం నమ్మడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుపై ఏమాత్రం సానుభూతి లేదని ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందనే చెబుతోందని అంటున్నారు. బాబు అరెస్ట్‌ అయిన సమయంలో కూడా ప్రజల నుంచే కాదు పార్టీలోనే స్పందన కనిపించలేదు. బయటకు వచ్చి ఆందోళనలు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు బతిమలాడుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చేసిన బంద్‌తో సహా ఏ కార్యక్రమానికీ జనం నుంచి స్పందన రాలేదు. 

దీపాలు వెలిగించి భువనేశ్వరి నిరసన.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి లోకేశ్, బ్రాహ్మణి  
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ‘కాంతితో క్రాంతి’ పేరుతో శనివారం రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకు రాజమహేంద్రవరంలోని లోకేశ్‌ శిబిరంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మహిళా నేతలు దీపాలు వెలిగించారు. అంతకు ముందే నారా లోకేశ్, బ్రాహ్మణి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు. కాగా, బాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ 27వ రోజుకు చేరింది.   

మరిన్ని వార్తలు