7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ!

2 Jun, 2021 05:35 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాకాణి

మొదట కోవిడ్‌ సోకిన వారికే

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు

ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు (అర్బన్‌): నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందును సోమవారం (ఈనెల 7వ తేదీ) నుంచి పంపిణీ చేసే అవకాశం ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. మందు తయారీ, పంపిణీ గురించి మంగళవారం నెల్లూరులోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్, జేసీలు హరేందిరప్రసాద్, గణేష్‌కుమార్, మందు తయారీదారు ఆనందయ్య తదితరులతో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వనమూలికలు సమకూర్చుకున్న తర్వాత నాలుగైదు రోజుల్లో మందు తయారు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారన్నారు.

కోవిడ్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకేచోట కాకుండా డీ సెంట్రలైజ్డ్‌ పద్ధతిలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ మందును ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని, పోస్టల్, కొరియర్‌ ద్వారా కూడా పంపిస్తామని తెలిపారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారికి కూడా ఇదే విధానంలో పంపిణీ చేస్తామన్నారు. కోవిడ్‌ సోకిన వారికి నయం చేసేందుకు మాత్రమే తొలిదశలో మందు పంపిణీ చేస్తామని తెలిపారు. తర్వాత దశలో కరోనా రాకుండా ఉండేందుకు మందు ఇస్తామన్నారు. ఎవరూ మందు కోసం కృష్ణపట్నం, నెల్లూరు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల మనోభావాలను అనుసరించి మందును పంపిణీ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. కంట్లో చుక్కల మందు పంపిణీకి సంబంధించి కోర్టు తుది తీర్పునకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఎవరూ కృష్ణపట్నం రావద్దు
కలెక్టర్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ కోవిడ్, కర్ఫ్యూ నిబంధనలు ఇతర ప్రాంతాల్లో లాగానే కృష్ణపట్నంలోనూ అమలవుతాయని తెలిపారు. ఇతర ప్రాంతాల వారు రాకుండా పోలీసు, రెవెన్యూ శాఖలు పని చేస్తాయన్నారు. ప్రజల కోసం కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ డీ సెంట్రలైజ్డ్‌ పద్ధతిలో మందును పంపిణీ చేస్తామన్నారు. సోషల్‌ మీడియాలో వదంతులను నమ్మవద్దన్నారు. మరో ఐదురోజుల్లో మందు పంపిణీ మొదలవుతుందన్నారు. వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో మందు కోసం బుక్‌ చేసుకోవచ్చన్నారు. కోర్టు తుది తీర్పునకు అనుగుణంగా మందు పంపిణీ చేస్తామని చెప్పారు.

ఆనందయ్యను సత్కరించిన ఎంపీ మాగుంట
ముత్తుకూరు: కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన మందుకు ప్రపంచ అగ్రదేశాల గుర్తింపు లభించిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశంసించారు. ఆయన మంగళవారం కృష్ణపట్నం గ్రామానికి వచ్చి ఆనందయ్యను సత్కరించారు. ఎంపీ మాట్లాడుతూ ఆనందయ్య మందు తయారీకి మాగుంట కుటుంబం అండగా ఉంటుందన్నారు. ఆనందయ్య ప్రకాశం జిల్లాకు కూడా వచ్చి ప్రజలకు కరోనా మందు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆనందయ్య మాట్లాడుతూ కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారీ మాత్రమే జరుగుతుందని, పంపిణీ ఉండదు కనుక ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ద్వారా ఆయుర్వేద మందుకు అనుమతులు లభించే విషయంలో సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, జిల్లాకు చెందిన మంత్రులకు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు