మందు తయారీకి కసరత్తు

1 Jun, 2021 05:41 IST|Sakshi
ఎమ్మెల్యే కాకాణితో ఆనందయ్య

సీఎంకు ఆనందయ్య ధన్యవాదాలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆనందయ్య కరోనా మందు పంపిణీకి కసరత్తు ప్రారంభమైంది. భద్రత కారణాల రీత్యా ఇప్పటి వరకు కృష్ణపట్నం పోర్టులోని అతిథి గృహంలో ఉన్న ఆనందయ్య.. సోమవారం సాయంత్రం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి కృష్ణపట్నంలోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కాకాణి మందు తయారీ, పంపిణీపై ఆనందయ్యతో చర్చించారు. మందుకు కావాల్సిన వనమూలికలు, దినుసులు సమకూర్చుకునేందుకు రెండు, మూడు రోజుల సమయం పట్టనుంది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఒకేచోట కాకుండా మూడు, నాలుగు కేంద్రాల ద్వారా మందు పంపిణీ చేయాలని యోచిస్తున్నారు.  

దినుసులు సేకరించాలి
ఆనందయ్య మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు సేకరించాల్సి ఉందని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. జిల్లా యంత్రాంగంతో చర్చించి మందు ఎక్కడ తయారు చేయాలి, ఏ ప్రాంతంలో పంపిణీ చేయాలనే అంశాల్ని నిర్ణయిస్తామన్నారు. ఇదంతా పూర్తికావడానికి మూడు, నాలుగు రోజులు పడుతుందని చెప్పారు. మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని విజ్ఞప్తి చేశారు. పంపిణీకి అన్ని అనుమతులు వచ్చాక ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
తన మందు వల్ల ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని పరిశోధన ద్వారా నిరూపితమైందని ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య తెలిపారు. మందు పంపిణీకి అనుమతి ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు