జూలైకి ఆనందపురం–అనకాపల్లి హైవే పూర్తి 

2 Aug, 2020 04:33 IST|Sakshi

భూ సేకరణలో ప్రైవేటు భూముల యజమానుల గుర్తింపులో ఆలస్యం

మొత్తం 51 కి.మీ.లలో 24 కి.మీ. నిర్మాణం పూర్తి  

సాక్షి, అమరావతి: అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన అనకాపల్లి–ఆనందపురం ఆరు లైన్ల రహదారి వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) లక్ష్యంగా పెట్టుకుంది. లాక్‌ డౌన్‌ కారణంగా నాలుగు నెలలుగా పనులు నిలిచిపోవడంతో పాటు భూ సేకరణలో ప్రైవేటు భూములకు సంబంధించి యజమానుల గుర్తింపులో జాప్యం జరుగుతుండటంతో రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. అనకాపల్లి–ఆనందపురం మధ్య 51 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారి నిర్మించేందుకు గతేడాది జనవరిలో మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్‌ బిల్డ్‌ కాన్‌ సంస్థ పనులు దక్కించుకుంది. ఈ రహదారిని కేంద్రం భారతమాల ప్రాజెక్టు కింద చేపడుతోంది. మొత్తం 330 హెక్టార్ల భూ సేకరణకు గాను 190 హెక్టార్లు ప్రైవేటు భూములు కావడంతో యజమానుల గుర్తింపులో జాప్యం జరుగుతోంది. మొత్తం భూసేకరణకు, ఆర్‌ అండ్‌ ఆర్‌కు రూ.700 కోట్లు కేటాయించారు. 

సగం నిర్మాణం పూర్తి 
► మొత్తం 51 కిలోమీటర్లలో 24 కి.మీల రహదారి నిర్మాణం పనులు పూర్తయ్యాయి. తగరపువలస–సంగివలస మధ్య నిర్మాణం పూర్తయింది. ఈ రహదారి పూర్తయితే విశాఖ సిటీ పరిధిలో 40 శాతం ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. 
► ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం నుంచి విజయవాడకు వెళ్లే భారీ వాహనాలు ఆనందపురం నుంచి అనకాపల్లికి మళ్లించవచ్చు.  
► ఆనందపురం–పెందుర్తి–సబ్బవరం, షీలానగర్‌ పోర్టు కనెక్టివిటీ మధ్య 13.6 కిలోమీటర్ల రహదారితో కలిపి కేంద్రం రూ.3 వేల కోట్లు మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు