ఆనందయ్య మందు: కృష్ణపట్నంలో టీడీపీ హడావుడి 

26 May, 2021 12:09 IST|Sakshi
బొనిగి ఆనందయ్య సతీమణితో మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి 

సాక్షి, ముత్తుకూరు: కృష్ణపట్నంలో మంగళవారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ నేతలు ఆనందయ్య మందు తయారీ ప్రాంతంలో హడావుడి చేశారు. సోమిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డాక్టర్‌ జెడ్‌ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తదితరులు తొలుత ఆనందయ్య ఇంటికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో సతీమణి ఇంద్రావతితో మాట్లాడారు. ఆనందయ్య వెన్నంటి ఉన్న యువకులను సత్కరించారు. మందు తయారీ ప్రాంతంలో కలయదిరిగి హడావుడి చేశారు. మందు పంపిణీ నిలిపి వేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు.  

చుక్కల మందు డ్రామా 
కరోనా నియంత్రణకు ఆనందయ్య మందు పేరుతో టీడీపీ నేతలు డ్రామా నిర్వహించారు. కృష్ణపట్నంలో మందు తయారీ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోపాలపురం వద్ద స్థానికేతరులను ఎవరినీ కృష్ణపట్నంలోకి వెళ్లనీయకుండా పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం తెలంగాణకు చెందిన ప్రకాష్‌ అనే కరోనా పేషెంట్‌ తల్లి మల్లీశ్వరితో గ్రామంలోకి నడుచుకుని వస్తుండగా చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలిపివేశారు. మరో మార్గంలో తల్లితో కలిసి కృష్ణపట్నంలోకి వచ్చేశాడు. సమీపంలోని ఒక చెట్టు కింద సేద దీరుతున్నాడు. అదే సమయంలో సోమిరెడ్డి నేతృత్వంలోని టీడీపీ బృందం అక్కడికి చేరుకుంది. ఆ పేషెంట్‌తో మాట్లాడారు. డ్రామాను రక్తికట్టించే విధంగా తల్లితో పాటు నడుచుకుంటూ వచ్చిన యువకుడి పరిస్థితిని విషమంగా ఉన్నట్లు చూపిస్తూ, కంట్లో రెండు చుక్కలు మందు వేయించారు. నిమిషాల్లో ఆ యువకుడు లేచి కూర్చొని, ఒళ్లు విరుచుకుంటూ నిలబడి సాధారణంగా మాట్లాడడం చూస్తే సినిమా ట్రిక్‌లా అనిపించింది.

అయితే అక్కడ జరుగుతున్న తంతును చూసి స్థానికులు సైతం ఒకింత ఆశ్చర్యపోయారు. నాలుగు రోజులుగా గ్రామంలో మందు తయారీ లేకపోవడం గమనార్హం. అయితే ఎక్కడి నుంచి కంటి మందు తెచ్చారో తెలియదు. ఆనందయ్య మందుపై ప్రజల్లో మరింత ఆసక్తి పెంచేలా డ్రామా వెనుక రాజకీయ కోణం కనిపిస్తోంది. ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందుపై ఆయుష్‌ శాఖ చేపట్టిన పరిశోధనలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే దశలో టీడీపీ ప్రజలను మరింత రెచ్చగొట్టే విధంగా ఉందని స్థానికులు సైతం విమర్శించడం కనిపించింది. 

చదవండి: కృష్ణపట్నంలో ఐసీఎంఆర్‌ బృందం

మరిన్ని వార్తలు