అనంతపురం: ఒక్క ఫోన్‌ కాల్‌.. నలుగురి ప్రాణాలు కాపాడింది

21 Nov, 2021 08:46 IST|Sakshi

భవన  శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తి నుంచి 100కు కాల్‌ 

తక్షణమే స్పందించిన అధికార యంత్రాంగం 

నలుగురిని కాపాడిన రెస్క్యూ టీం 

శిథిలాల కింద ఆరుగురు మృతి 

అనంతపురం: ఒక్క ఫోన్‌ కాల్‌ అధికారులను అప్రమత్తం చేసింది. నలుగురి ప్రాణాలను కాపాడింది. శనివారం తెల్లవారుజామున కదిరి పట్టణంలోని చైర్మన్‌ వీధిలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం కుప్పకూలి..శిథిలాలు పక్కనే ఉన్న మరో రెండిళ్లపై పడటంతో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సైదున్నీసా(2), ఫారున్నీసా(8 నెలలు), యాషికా(3)తో పాటు మరో ముగ్గురు మహిళలు ఫైరోజా(65), భాను(30), ఫాతిమాబీ(65) ఉన్నారు. అయితే..ఇదే ఘటన నుంచి నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఫోన్‌కాల్‌ వల్ల వారి ప్రాణాలు నిలిచాయి. 

8 గంటలు శిథిలాల కిందే ఉన్నా.. 
కదిరి మండలం చిగురుమాను తండాకు చెందిన డిప్లొమా విద్యార్థి తరుణ్‌ నాయక్‌ శుక్రవారం రాత్రి వరద ఉధృతి కారణంగా స్వగ్రామానికి వెళ్లలేకపోయాడు. కదిరిలో తనకు తెలిసిన చైర్మన్‌ వీధిలో నివాసముంటున్న క్యాటరింగ్‌ వంట మాస్టర్‌ రాజు ఇంట్లో ఉండిపోయాడు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచాడు. తాము ఉంటున్న ఇల్లు కూలిపోయిందని గ్రహించాడు. వెంటనే తనతో పాటు నిద్రిస్తున్న రాజు, మీటేనాయక్‌ తండాకు చెందిన ఐటీఐ విద్యార్థి గౌతమ్‌నాయక్, రామదాస్‌ తండాకు చెందిన ఉదయ్‌ నాయక్‌లను అప్రమత్తం చేసి.. గోడ వైపు సురక్షిత ప్రదేశానికి మెల్లిగా జరిగారు. 

వెంటనే తరుణ్‌ తన మొబైల్‌ నుంచి డయల్‌ 100కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. దీంతో అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్, డీఎస్పీ భవ్య కిశోర్, ఆర్డీఓ వెంకటరెడ్డి, సీఐలు మధు, సత్యబాబు, ఫైర్, 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు.

తరుణ్‌తో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ... అందుకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించి ఎనిమిది గంటల తర్వాత నలుగురినీ బయటకు తీశారు. కాకపోతే వీరు ఉంటున్న ఇంట్లో గ్యాస్‌ లీక్‌ కావడంతో వీరందరికీ గాయాలయ్యాయి.  కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వంట మాస్టర్‌ రాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మేజిస్ట్రేట్‌ వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం అతన్ని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. 

ముగ్గురు మహిళలు... ముగ్గురు చిన్నారుల దుర్మరణం 
నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో నిద్రిస్తున్న ఫైరోజా(65) శిథిలాల కింద చిక్కుకుని మృతిచెందారు.  ఈ భవనం శిథిలాలు పడటంతో పక్కింటి పైఅంతస్తులో ఉంటున్న జర్నలిస్టు సోమశేఖర్‌ భార్య భాను(30), వీరి మూడేళ్ల కూతురు యాషికా, అత్త ఫాతిమాబీ(65) నిద్రలోనే కన్నుమూశారు.  ఆ పక్కింటిలో ఉంటున్న హబీబుల్లా, కలీమున్నీసా, కరీముల్లా, హబీబున్నీసా, హిదయతుల్లా భవనం కూలిన శబ్దానికి నిద్రలేచి బయటకు పరుగులు  తీశారు.

అయితే కరీముల్లా దంపతుల ఎనిమిది నెలల చిన్నారి ఫారున్నీసాతో పాటు రెండేళ్ల చిన్నారి సైదున్నీసాలను మాత్రం కాపాడుకోలేకపోయారు. వారు శిథిలాల కిందే మృత్యు ఒడికి చేరారు. భార్యతో పాటు అత్త, కుమార్తెను కోల్పోయిన పాత్రికేయుడు సోము, తమ ఇద్దరు బిడ్డలను కాపాడుకోలేక పోయిన కరీముల్లా దంపతులు విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది.  

ఎమ్మెల్యేతో సహా అందరికీ హ్యాట్సాఫ్‌ 
సహాయక చర్యల్లో ముమ్మరంగా పాలుపంచుకున్న పోలీస్, రెవెన్యూ, ఫైర్, మున్సిపల్, 108, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు దగ్గరుండి పర్యవేక్షించిన ఎమ్మెల్యే డాక్టర్‌ సిద్ధారెడ్డికి పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తిరిగొచ్చిన ఎమ్మెల్యే శనివారం ఉదయం 8 గంటలకే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ సైతం కదిరికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు.  
 

మరిన్ని వార్తలు