అఫ్గాన్‌లో మా చెల్లిని చంపేశారు

19 Aug, 2021 04:41 IST|Sakshi

విలపిస్తున్న జేఎన్‌టీయూ–ఏ విద్యార్థిని 

కుటుంబసభ్యుల భద్రతపై విద్యార్థుల కలత 

వీసా గడువు పొడిగించాలని వినతి 

అనంతపురం విద్య: అఫ్గానిస్తాన్‌లో మా చెల్లిని చంపేశారు.. తాలిబన్లు కాల్చేశారు.. మార్కెట్‌కు వచ్చినప్పుడు కాల్చి చంపేశారు.. అంటూ అనంతపురం జేఎన్‌టీయూ విద్యార్థిని బీబీ రహెనా అజీజీ విలపించారు. అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్‌లో తమ కుటుంబసభ్యుల భద్రతపై ఇక్కడ చదువుకుంటున్న అఫ్గానీయులు భయపడుతున్నారు. అక్కడి పరిస్థితులపై వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జేఎన్‌టీయూలో అఫ్గానిస్తాన్‌కు చెందిన 12 మంది బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చదువుతున్నారు. మరోవైపు జేఎన్‌టీయూ– అనంతపురంలో విదేశీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారనే అంశంపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్‌ (ఐసీసీఆర్‌) ఆరా తీసింది. వారి వీసా గడువు ఎప్పటికి ముగుస్తుంది.. తదితర అంశాలపై రెండు రోజుల్లో సమాచారం ఇవ్వాలని వర్సిటీ అధికారులను కోరింది.  

బిగుతు దుస్తులు ధరించిందని.. 
మేం కాబూల్‌లో నివసిస్తున్నాం. తాలిబన్లు రెండురోజుల కిందట మా చెల్లిని చంపేశారు. మార్కెట్‌కు వచ్చినప్పుడు బిగుతు దుస్తులు ధరించిందనే నెపంతో కాల్చి చంపారు. ఆ దుర్వార్త విన్నప్పటి నుంచి మనసు కలత చెందుతోంది. మా ఇంట్లో వాళ్లను తలుచుకుంటుంటే ఇంకా భయమేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌ 30న నా వీసా గడువు ముగుస్తుంది. ఎంబీఏ కోర్సు కూడా అప్పటికి పూర్తవుతుంది. మా కుటుంబసభ్యులు మాత్రం ఇప్పుడే రావద్దు.. పరిస్థితులు చక్కబడ్డాక రావాలని చెబుతున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులను కలసి వీసా గడువు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని కోరాం. 
– బీబీ రహెనా అజీజీ, ఎంబీఏ రెండో సంవత్సరం విద్యార్థిని 

పరిస్థితులు చక్కబడేవరకు ఇక్కడే 
అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులు తారుమారయ్యాయి. నాకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పా.  బీటెక్‌ ఇంకా రెండేళ్లు ఇక్కడే చదువుతా. పరిస్థితులు చక్కబడ్డాక స్వదేశానికి వెళతా.  
– మహమ్మద్‌ ఆమీర్‌ సాలేహా, బీటెక్‌ రెండో సంవత్సరం విద్యార్థి 

అమ్మానాన్నలతో మాట్లాడుతున్నా 
మేం కాబూల్‌లో నివాసముంటున్నాం. అక్కడి పరిస్థితులు తలచుకుంటే భయమేస్తోంది. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కన్పిస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడేలా లేవు. అమ్మానాన్నలతో ఫోన్‌లో తరచు మాట్లాడుతున్నా. పరిస్థితులు చక్కబడేవరకు అక్కడికి రావద్దని చెబుతున్నారు. 
– హరుణ్‌ఖాన్, బీటెక్‌ రెండో సంవత్సరం విద్యార్థి 

వీసా గడువు పొడిగించాలని కోరాం 
ఇక్కడ చదువుతున్న అఫ్గాన్‌ విద్యార్థులకు అండగా నిలుస్తాం. వీసా గడువు త్వరలో ముగుస్తున్న విద్యార్థులకు కోర్సు కాలవ్యవధి పెంచుతాం. అలాగే వీసా గడువు మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాం.  
– ప్రొఫెసర్‌ సి.శశిధర్, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ–అనంతపురం  

మరిన్ని వార్తలు