‘నారాయణ’ ఒత్తిళ్లు తాళలేకనే ఆత్మహత్యాయత్నం.. యాజమాన్యం లెటర్‌ డ్రామా.. విద్యార్థికి సీరియస్‌!

8 Feb, 2023 07:09 IST|Sakshi
చికిత్స పొందుతున్న భవ్యశ్రీ

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: కళాశాల యాజమాన్యం వేధింపులు తాళలేకనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు అనంతపురం బస్టాండు సమీపంలోని నారాయణ జూనియర్‌ కళాశాల విద్యార్థిని భవ్యశ్రీ వివరించింది.  విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భవ్యశ్రీని పోలీసులు విచారణ చేస్తుండగా చిత్రీకరించిన అంశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఈ విషయం వెలుగు చూసింది.

విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మొదట కుటుంబకలహాలే కారణమన్న కోణంలో కళాశాల యాజమాన్యం చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అదే నిజమని బుకాయించే ప్రయత్నం చేసింది. అయితే బాధిత విద్యార్థిని కుటుంబసభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలను పోలీసులు ఆరా తీయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను రాత్రికి రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  

హాజరెందుకేయలేదని ప్రశ్నించిన పోలీసులు 
సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఘటనపై అదే రోజు నారాయణ కళాశాలలో అనంతపురం వన్‌టౌన్‌ సీఐ రవిశంకరరెడ్డి విచారణ చేపట్టారు.  భవ్యశ్రీ ఉదయం 7.20 గంటలకు కళాశాలకు చేరుకున్నట్లుగా గుర్తించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కళాశాల నాల్గో అంతస్తు మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా నిర్ధారించుకున్నారు. హాజరుకు సంబంధించి పట్టికను పరిశీలించగా అందులో అబ్సెంట్‌ వేసి ఉండడంపై సంబంధిత అధికారులను సీఐ రవిశంకరరెడ్డి ప్రశ్నించారు. కళాశాలకు హాజరైనా..  అబ్సెంట్‌ ఎందుకు వేశారంటూ ప్రిన్సిపాల్‌ను మందలించారు.  

విద్యార్థులను ఆరా తీసిన డీఎస్పీ : విద్యార్థిని భవ్యశ్రీ ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన కారణాలపై డీఎస్పీ జి. ప్రసాదరెడ్డి మంగళవారం ఆరా తీశారు. భవ్యశ్రీకి అత్యంత సన్నిహితంగా ఉన్న వారిని పిలిచి ఘటనకు సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఫీజుల చెల్లింపు విషయంలో యాజమాన్యం కర్కశంగా వ్యవహరిస్తోందంటూ డీఎస్పీ ఎదుట పలువురు విద్యార్థులు వాపోయినట్లు తెలిసింది.    

లెటర్‌ డ్రామా
శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన సదాశివ, జ్యోతి దంపతులు అనంతపురం పాతూరులో నివాసం ఉండేవారు. వారి కుమార్తె భవ్యశ్రీ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న నారాయణ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఉపాధి కోసం బెంగుళూరుకు వలస వెళ్తూ.. భవ్యశ్రీని నీరుగంటి వీధిలో ఉన్న అమ్మమ్మ అలివేలమ్మ వద్ద వదిలి వెళ్లారు. కళాశాల ఫీజు రూ.12 వేలు చెల్లించాల్సి ఉండగా, ఇటీవల రూ.10 వేలు కట్టారు. మరో రూ.2 వేలు పెండింగ్‌ ఉంది. దీనికి తోడు పరీక్ష, రికార్డు ఫీజు రూ.820 కలిపి.. మొత్తం రూ.2,820 చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో మనస్థాపానికి గురైన భవ్యశ్రీ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కళాశాల భవనం మూడో అంతస్తుపై నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

ఇక.. ఇంటర్‌ విదార్థిని భవ్యశ్రీ ఆత్మహత్యాయత్నాకి వేరే కారణాలున్నాయని చూపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా సూసైడ్‌ నోట్‌ డ్రామాకు తెరలేపారు. తన అమ్మా నాన్న విడిపోయారని, వారిని ఎవరూ కలపలేరని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని విద్యార్థి లేఖ రాసి మరీ దూకినట్లు ప్రచారం జరిగింది. విద్యార్థిని సూసైడ్‌ నోట్‌ రాసిందని అనంతపురం వన్‌టౌన్‌ సీఐ రవిశంకర్‌రెడ్డి మీడియాతో అన్నారు. ఆ లేఖను సీజ్‌ చేశామని, తల్లిదండ్రులకు చూపించి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. కానీ తాను లేఖ రాయలేదని విద్యార్థి సంఘాల నాయకులతో బాధిత విద్యార్థిని చెప్పినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు