సెంట్రల్‌ జైలులో ఉంచినా.. నమ్మిన జెండా వీడలేదు.. సమర్థతను గుర్తించి

13 Nov, 2021 10:23 IST|Sakshi

అనంత సేవలకు పట్టం

సమర్థతను గుర్తించిన పార్టీ

‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్సార్‌ సీపీ ప్రకటన

మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి

ఏజెన్సీలో టీడీపీపై ఎదురొడ్డి పోరాడిన నేతగా అనంతబాబుకు గుర్తింపు

సాక్షి, రాజమహేంద్రవరం: పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేసిన నాయకులకు వైఎస్సార్‌ సీపీలో సముచిత స్థానం లభిస్తుందనేది మరోసారి రుజువైంది. పార్టీకి అనంతబాబు చేసిన సేవలకు గుర్తింపుగా సముచిత స్థానం కల్పిస్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు సందర్భాల్లో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం సీఎం ఆదేశాల మేరకు వైఎస్సార్‌ సీపీ అధిష్టానం రంపచోడవరం నేత అనంత సత్య ఉదయభాస్కర్‌(అనంత బాబు)ను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించింది. ఆయన గెలుపు లాంఛనమే కానుంది. మున్సిపల్, జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఇటీవల వైఎస్సార్‌ సీపీ తిరుగులేని ఆధిక్యం చాటుకుంది. ఈ క్రమంలో అనంతబాబు గెలుపు నల్లేరుపై నడకే కానుంది.

‘ఓదార్పు’ నుంచీ జగన్‌ వెంటే..
దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడు అనంతబాబు. ఓదార్పు యాత్ర నుంచి ఇప్పటి వరకూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి నిలిచారు. అధికారంలో ఉండగా తమ పార్టీలో చేరాలని టీడీపీ నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయి. అక్రమ కేసులు పెట్టి వేధించినా తల వంచలేదు. తొమ్మిది రోజులు విశాఖ సెంట్రల్‌ జైలులో ఉంచినా పార్టీకే కట్టుబడి ఉన్నారు. ఆయన చెమటోడ్చి 2014లో వంతల రాజేశ్వరిని ఎమ్మెల్యేగా గెలిపించినా ప్రలోభాలకు లొంగిన ఆమె పార్టీ ఫిరాయించారు.

స్వయానా మేనమామలైన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు సైతం వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించినా అనంతబాబు నమ్మిన జెండా వీడలేదు. రంపచోడవరం నియోజకవర్గంలో జగన్‌ ఓదార్పు యాత్ర చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేశారు. అప్పటి నుండి జగన్‌ వెంట నడుస్తూ పార్టీని ఒంటి చేత్తో విజయపథాన నడిపిస్తూ మంచి గుర్తింపు పొందారు.

చదవండి: (అన్నిటా అగ్రతాంబూలం.. రెండు ఎమ్మెల్సీ పదవులూ వారికే..)

రాజకీయ కుటుంబ నేపథ్యం
అనంత బాబు తాత వీర్రాజు, ముత్తాత పడాల వీర్రాజు పలు పర్యాయాలు అడ్డతీగల సమితి అధ్యక్షులుగా పని చేశారు. తండ్రి అనంత చక్రరావు 1982లో అడ్డతీగల సమితి ప్రెసిడెంట్, 1987లో అడ్డతీగల ఎంపీపీగా పని చేశారు. వారి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అనంత బాబు ఏజెన్సీలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న ఏజెన్సీలో తనదైన రాజకీయ వ్యూహంతో వైఎస్సార్‌ సీపీకి బలమైన బాటలు వేశారు.

2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ జెండాను రెపరెపలాడించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ పక్షాన నాగులపల్లి ధనలక్ష్మి సాధించిన 38 వేల ఓట్ల భారీ మెజారి అప్పట్లో ఒక రికార్డు. 2014, 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవశం చేసుకోవడంలో అనంతబాబు విశేష కృషి చేశారు. 2001లో అడ్డతీగల జెడ్పీటీసీగా, 2006లో ఎంపీపీగా, 2019లో డీసీసీబీ చైర్మన్‌గా పని చేశారు. టీడీపీ హయాంలో డీసీసీబీ పరిధిలోని పలు ప్రాథమిక సహకార సంఘాలు, బ్రాంచిల్లో జరిగిన అవినీతి బాగోతాలపై ఉక్కు పాదం మోపారు. 

మరిన్ని వార్తలు