పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే..

30 Dec, 2022 17:33 IST|Sakshi

మొదలైన అనపకాయల సీజన్‌

దోసె, రాగిసంగటిలో పితికిపప్పు భలేభలే

పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు

కిలో అనపయకాలు రూ.30 

మదనపల్లె సిటీ: ఎంతో అత్రుతగా ఎదురుచూసే అనపకాయల సీజన్‌ వచ్చేసింది. మార్కెట్‌ను అనపకాయలతో ముంచెత్తుతుంది. అన్నమయ్య జిల్లాలోని పడమటి మండలాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో వేరుశనగతో పాటు అనపకాయలు పండిస్తారు. నవంబర్‌ నుంచి జనవరి చివరి వరకు  సీజన్‌ ఉంటుంది. రామసముద్రం, మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం, పీలేరు ప్రాంతాల్లో అనపకాయలు పండిస్తున్న రైతులు మార్కెట్‌కు తెస్తున్నారు. కిలో రూ.30 వంతున విక్రయిస్తున్నారు. అనపకాయలతో చేసే పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. భోజనప్రియులు పితికిపప్పు కూరను ఎంతో ఇష్టంగా తింటారు.  


సంక్రాంతి వరకు ఘుమఘుమలే
 
అనపకాయలు సంక్రాంతి దాకా విరివిగా లభ్యమవుతాయి. దీంతో ఇళ్లల్లో వారానికి మూడు సార్లయినా పితికిపప్పు రుచి చూడాల్సిందే. కేవలం వర్షా«ధారంగా చేళ్లల్లో పండిన నాటు అనపకాయలు మాత్రమే చాలా రుచిగా ఉంటాయి. వీటిని ముట్టుకోగానే బంకగా ఉండి, వాటి  వాసన గంటసేపు ఉంటుంది. 


అబ్బా దాని రుచే వేరు 

అనపగింజలను గింజల కూర, చారు, సాంబారు చేస్తారు. అనపకాయలు ఒలిచి గింజలను గిన్నెలో నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు గింజలను పితికి పప్పు కూరలు, చారుగా చేస్తారు. ఉదయమే దోసెల్లో పితికిపప్పు ఇష్టంగా తింటారు. కొందరు పితికిపప్పును ఎండబెట్టి నూనెలో వేపుడు చేసి తింటారు.  


పొరుగు రాష్ట్రాలకు..
 
మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండులో అనపకాయలకు మార్కెట్‌ ఉంది. రామసముద్రం, నిమ్మనపల్లె, మదనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం ప్రాంతాల నుంచి మార్కెట్‌కు రైతులు ప్రతి రోజు సాయంత్రం అనపకాయలు సంచుల్లో తెస్తారు. ఇక్కడి నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి చెన్నై, వేలూరు, బెంగళూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు నిత్యం ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్‌కు ప్రతి రోజు 5 వేల కేజీల అనపకాయలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో అనపకాయలకు మంచి డిమాండ్‌ ఉంది. రుచిగా ఉండటంతో వీటిని బాగా ఇష్టపడతారు.   


వర్షాలకు పంట దెబ్బతినింది
 
అనపచెట్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. పురుగు పట్టడం వల్ల దిగుబడి తగ్గింది. ఎకరాలో అనపపంట సాగు చేశాను. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి.      
– మణి, రైతు, ఒంటిమిట్ట


వారానికి రెండు, మూడు సార్లు వండుతా

ఇది సీజన్‌. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే కాయలు. అందుకే మదనపల్లె మార్కెట్‌కు వెళ్లి అనపకాయలు తెచ్చుకుంటా. వారంలో మూడురోజులైనా పితికిపప్పు కూర  వండుతాం. పిల్లలు ఇష్టంగా తింటారు.     
– మంజుల, గృహిణి, సిటిఎం


పోషకాలు మెండు 

ఈ సీజన్‌లో మాత్రమే లభించే అనపకాయలు, పితికిపప్పు మంచి పోషకాలు ఉంటాయి.  క్రిమిసంహారక మందులు లేకుండా వర్షాధారంగా చేలల్లో పంట పండుతుంది. ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది.     
– డాక్టర్‌ సరస్వతమ్మ, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె 

మరిన్ని వార్తలు