CM YS Jagan: అప్రమత్తంగా ఉండాలి

16 Jul, 2022 04:22 IST|Sakshi
వరద ప్రభావంతో నీట మునిగిన ప్రాంతం

వచ్చే 24 గంటలు చాలా కీలకం 

లంక, ముంపు గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించండి 

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే.. అనంతరం ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ 

లంక, వరద ప్రభావిత, గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి 

ప్రజలను సహాయ శిబిరాలకు తరలించండి

గట్లకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి 

బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, రూ.2 వేలు నగదు.. అధికారులకు సీఎం ఆదేశం   

సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం: గోదావరి ముంపు గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రధానంగా లంక గ్రామాలతో పాటు వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని, గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లోతట్టు ప్రాంతాల వారందరినీ సహాయ శిబిరాలకు తరలించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు.

ఇది చాలా ప్రధాన అంశమని, వచ్చే 24 గంటలు చాలా కీలకమని (క్రిటికల్‌), హై అలర్ట్‌ (అత్యంత అప్రమత్తం)గా ఉండాలని సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లా, యానాం ప్రాంతాల్లో పరిస్థితులను హెలికాప్టర్‌ ద్వారా సుమారు గంటన్నర పాటు ప్రత్యక్షంగా పరిశీలించారు.


ముంపునకు గురైన పొలాలు, ఇళ్లు, రహదారులను పరిశీలించి పరిస్థితిపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం తన క్యాంపు కార్యాలయం నుంచి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్‌ అధికారిని నియమించినట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో మాట్లాడారు.

ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, సహాయ చర్యలపై ఆరా తీశారు. ముంపు గ్రామాలు, ఏర్పాటు చేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, వైద్యం.. మందులు సహా అత్యవసర సేవలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. వివిధ విభాగాలకు చెందిన సీనియర్‌ అధికారులకు సైతం తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

అందుబాటులో సీఎంవో కార్యదర్శులు 
వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్‌ అధికారిని నియమించాం. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోరినా.. సీఎస్‌ సహా వీరంతా యుద్ధ ప్రాతిపదికన వారికి ఆ సాయం అందించేలా చూడాలి. సీఎంవో కార్యదర్శులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు.

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శనివారం కూడా గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని సమాచారం వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

గట్లు బలహీనంగా ఉన్న చోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన పక్షంలో గండ్లకు ఆస్కారం ఉన్న చోట తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా వీలైనన్ని ఇసుక బస్తాలు తదితర సామగ్రిని సిద్ధం చేయాలి. ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

రాజమండ్రిలో రెండు హెలికాప్టర్లు సిద్ధం
రాజమండ్రిలో రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు వీటిని వినియోగించుకోవాలి. గ్రామాల్లో పారిశుధ్య సమస్య రాకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలి. పాము కాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలి.

వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో అందించే సేవలు నాణ్యంగా ఉండాలి. బాధితులను ఆదుకోవడంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం లేకుండా చూసుకోవాలి. సెల్‌ టవర్లకు డీజిల్‌ సరఫరా చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలి.

వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలి. 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలి. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు ఇవ్వాలి.

సమీక్షలో సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రావత్, ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ కె.విజయానంద్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్‌ అంబేడ్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు