సెకండియర్‌ విద్యార్థులంతా పాస్‌.. వెయిటేజీ ఇలా

24 Jul, 2021 02:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇంటర్‌ సెకండియర్‌ పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి 5,19,797 మంది సెకండియర్‌ విద్యార్థులకు వచ్చిన మార్కులను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. వీరిలో బాలురు 2,58,310 మంది, బాలికలు 2,61,487 మంది ఉన్నారు. వీరి మార్కుల షార్ట్‌ మెమోలను ఈనెల 26వ తేదీ సాయంత్రం నుంచి బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు. కోవిడ్‌–19 కారణంగా ఈ విద్యా సంవత్సరంలో పరీక్షలు నిర్వహించనందున ఈ విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించారు. సెకండియర్‌ విద్యార్థులకు వారి టెన్త్, ఇంటర్‌ ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా మార్కులను కేటాయించారు. ప్రాక్టికల్, నైతిక విలువలు, పర్యావరణ శాస్త్రం పరీక్షలకు సంబంధించిన మార్కులను య«థాతథంగా ఇచ్చారు. ఫస్టియర్‌ విద్యార్థులను కనిష్ట పాస్‌ మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటిస్తూ రెండో సంవత్సరంలోకి ప్రమోట్‌ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఆదిమూలపు ఈ వివరాలు వెల్లడించారు.

మార్కుల వెయిటేజీ ఇలా..
2021 ఇంటర్మీడియెట్‌ థియరీ పరీక్షలను మే 5 నుంచి 23 వరకు నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లుచేసినా కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి వాయిదా వేయాల్సి వచ్చింది. అంతకుముందే.. ప్రాక్టికల్‌ పరీక్షలు, ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్‌ సైన్సు పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం.. సెకండియర్‌ విద్యార్థులకు మార్కులతో ఫలితాల వెల్లడికి ఫార్ములా నిమిత్తం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి ఛాయారతన్‌ నేతృత్వంలో హైపవర్‌ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టెన్త్‌ మార్కులకు 30 శాతం, ఇంటర్‌ ఫస్టియర్‌ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇవ్వాలని కమిటీ సూచనలతో సెకండియర్‌ మార్కులను బోర్డు ప్రకటించింది. అలాగే, టెన్త్‌లో విద్యార్థులు మంచి మార్కులు సాధించిన మూడు సబ్జెక్టుల (బెస్ట్‌ 3) సరాసరి మార్కులను తీసుకోగా.. ఇంటర్‌ ఫస్టియర్‌లోని అన్ని సబ్జెక్టుల మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. ఇక ప్రాక్టికల్స్, ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్‌ సైన్సు పరీక్షల మార్కులను య«థాతథంగా విద్యార్థుల మెమోల్లో పొందుపర్చనున్నట్లు మంత్రి సురేష్‌ వివరించారు. 

ప్రైవేటు విద్యార్థులకు పాస్‌ మార్కులు
ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో గతంలో ఫెయిలై ఈసారి ప్రైవేటుగా పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించిన వారికి.. ఫస్టియర్లో ఫెయిలైన సబ్జెక్టుల కోసం ఫీజు చెల్లించిన వారికి ఆయా సబ్జెక్టులకు కనిష్ట పాస్‌ మార్కులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే, ఫస్టియర్‌ మార్కులలో బెటర్‌మెంట్‌ కోసం పరీక్ష ఫీజు చెల్లించిన వారికి గతంలో వచ్చిన మార్కులనే యథాతథంగా కేటాయిస్తున్నామన్నారు. ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి, ఫెయిలైన వారికి కూడా ఆయా సబ్జెక్టులకు కనిష్ట పాస్‌ మార్కులు కేటాయిస్తున్నట్లు ఆదిమూలపు వివరించారు. హైపవర్‌ కమిటీ సూచించిన విధానంలో కేటాయించిన మార్కులపై ఎవరికైనా అసంతృప్తి ఉంటే వారికి సెకండియర్‌ పరీక్షలను రాసేందుకు ఓ అవకాశమిస్తామని మంత్రి చెప్పారు. సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాక ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు
ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి సందేహాలు, ఇతర సమస్యలుంటే వాటిని నివృత్తి చేసి పరిష్కరించేందుకు వివాద పరిష్కార కమిటీని ఇంటర్మీడియెట్‌ బోర్డు ఏర్పాటుచేస్తోంది. అలాంటి వారు బోర్డు ఏర్పాటుచేసిన ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లో తమ సమస్యలను తెలియజేయవచ్చు.

26న వెబ్‌సైట్‌లో షార్ట్‌ మార్కుల మెమోలు
ఇంటర్‌ సెకండియర్‌ మార్కుల షార్ట్‌ మెమోలను ఈనెల 26వ తేదీ సాయంత్రం నుంచి బోర్డు వెబ్‌సైట్‌ ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ లో పొందుపర్చనున్నారు. అనంతరం విద్యార్థులు తమ మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు, సమస్యలుంటే  ‘ఓయూఆర్‌బీఐఈఏపీఎట్‌దరేట్‌జీమెయిల్‌.కామ్‌’ మెయిల్‌కు లేదా 9391282578 నంబర్‌లోని వాట్సాప్‌కు మెసేజ్‌ ఇవ్వవచ్చని బోర్డు వివరించింది. మీడియా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ, పరీక్షల నియంత్రణాధికారి రమేష్‌లు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలు
2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్, డిగ్రీ కోర్సుల అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. గత ఏడాదే ఇంటర్మీడియెట్‌లో 70 శాతం ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించామని.. మధ్యలో హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఈ ఏడాది పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ప్రవేశాలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. టెన్త్‌ ఫలితాలను విడుదల చేయకముందే ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించడంపై మంత్రి స్పందిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు