Andhra Pradesh: ఈ నెల 7 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

3 Mar, 2022 04:02 IST|Sakshi

గవర్నర్‌ ఆదేశాల మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసిన శాసనసభ కార్యదర్శి 

7న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ 

అనంతరం మంత్రివర్గం భేటీ 

సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీలో నిర్ణయం 

11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న బుగ్గన 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 2022–23 బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అదే రోజున శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశాల మేరకు శాసనసభ, శాసన మండలి సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు బుధవారం జారీ చేశారు.

ఈ నెల 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. బడ్జెట్‌ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ (బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. శాసనసభలో 2022–23 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఈ నెల 11న ప్రవేశపెట్టనున్నారు.  

మరిన్ని వార్తలు