యువ ఓటర్లే లక్ష్యం

10 Nov, 2022 04:54 IST|Sakshi
ఓటర్ల అవగాహన ర్యాలీలో విద్యార్థులతో కలసి నడుస్తున్న ముఖేష్‌ కుమార్‌ మీనా, కలెక్టర్‌ ఢిల్లీరావు తదితరులు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా     

రాష్ట్రంలో 18 – 19 వయసున్న యువత సంఖ్య 12 లక్షలు 

ఓటర్ల జాబితాలో నమోదైంది 78 వేల మంది మాత్రమే  

ఓటు హక్కు నమోదుకు ప్రత్యేకంగా అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ 

డిసెంబర్‌ 8 వరకు ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ 

జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటన

సాక్షి, అమరావతి: అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన అనంతరం బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఓటరు నమోదుపై కళాశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావుతో కలసి పాల్గొన్నారు. బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ యువతతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలో 18 – 19 ఏళ్ల వయసున్న యువత 12 లక్షల వరకు ఉండగా ముసాయిదా ఓటర్ల జాబితాలో 78 వేల మంది మాత్రమే ఉన్నారని ముఖేష్‌కుమార్‌ మీనా చెప్పారు.

ఈ వయసు వారిలో 10 – 11 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ప్రత్యేకంగా అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందని, ఈ ప్రక్రియ సోమవారం నాటికి పూర్తవుతుందన్నారు.  

► ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,54,093 కాగా ఇందులో అత్యధికంగా 2,01,34,621 మంది మహిళా ఓటర్లున్నారు. 1,97,15,614 మంది పురుష ఓటర్లు, 3,858 మంది ధర్డ్‌ జెండర్‌ ఓటర్లున్నారు. కాగా ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,07,36,000 మంది ఓటర్లు ఉన్నారు. మృతులు, మరో ఊరికి వెళ్లిన వారు, డూప్లికేట్‌ ఓట్లు కలిపి మొత్తం దాదాపు 8.82 లక్షల ఓట్లను తొలగించారు.   

► ఓటర్లుగా నమోదు, అభ్యంతరాలు సమర్పించేందుకు ప్రత్యేక సవరణలో భాగంగా డిసెంబర్‌ 8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. సీఈవో వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశీలన పూర్తి చేసిన తరువాత వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు నవంబరు 19, 20, డిసెంబర్‌ 3, 4వ తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల స్థాయిలో ప్రత్యేక క్యాంపెయిన్లను నిర్వహిస్తారు. 

► ప్రస్తుతం 17 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ, జూలై 1వ తేదీ, అక్టోబర్‌ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు కొత్తగా ఓటర్లుగా  నమోదుకు ఫామ్‌–6 ద్వారా ముందుగానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.  

► డూప్లికేట్‌ పేర్లను గుర్తించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రాష్ట్రంలో 25 లక్షల పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పంపింది. దీని ప్రకారం క్షేత్రస్థాయిలో తనిఖీల అనంతరం డూప్లికేట్‌ పేర్లను ఫొటోలతో సహా గుర్తించి 10,52,326 ఎంట్రీలను తొలగించారు. ఫలితంగా ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన జాబితాతో పోలిస్తే ముసాయిదాలో 8.82 లక్షల మంది ఓటర్లు తగ్గారు.  

► ఇళ్లు లేని వారు, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరాశ్రయులను సైతం ఓటర్లుగా నమోదు చేసేందుకు ఇంటి చిరునామా ధ్రువీకరణ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం మినహాయింపు ఇచ్చింది. ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి పరిశీలన చేసి అలాంటి వారికి ఓటు హక్కు కల్పిస్తారు.  

► మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఓటర్ల నమోదు చేపడతారు. రాష్ట్రంలో జనాభా ఓటర్ల నిష్పత్తి 70.9 శాతం ఉండాల్సి ఉండగా 72.4 శాతం ఉంది. మిగతా రాష్ట్రాల కన్నా ఏపీలో నిష్పత్తి మెరుగ్గా ఉంది.  
► ఏపీలో గతంలోనూ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,025 మంది మహిళా ఓటర్లున్నారు.  

► 18 ఏళ్లు నిండిన అర్హుల్లో 5,23,580 మంది దివ్యాంగ ఓటర్లున్నారు. 

► అత్యధిక ఓటర్లున్న జిల్లాలుగా అనంతపురం (19,13,813), కర్నూలు (19,13,654), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (18,99,103) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అత్యల్ప ఓటర్లున్న జిల్లాలుగా అల్లూరి సీతారామరాజు (7,15,990), పార్వతీపురం మన్యం (7,70,175), బాపట్ల (12,66,110) జిల్లాలు నిలిచాయి.

ఆధార్‌ అనుసంధానం స్వచ్ఛందమే
ఓటర్ల జాబితా విషయంలో అత్యంత పారదర్శకత పాటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఐదు సూత్రాలను అమలు చేస్తోందని ముఖేష్‌కుమార్‌ మీనా వెల్లడించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ముసాయిదా జాబితాలను అందచేస్తామన్నారు. ఓటరు కార్డులతో ఆధార్‌ అనుసంధానం ఇప్పటికే 60 శాతం పూర్తి కాగా మిగతా 40 శాతం డిసెంబర్‌ నాటికి పూర్తవుతుందన్నారు.

ఫోన్‌ నంబర్లు కూడా సేకరించాల్సిందిగా సూచించామన్నారు. ఆధార్‌ అనుసంధానం స్వచ్ఛందమే కానీ తప్పనిసరి కాదన్నారు. ఆధార్‌ ఇవ్వకున్నా ఇతర సర్టిఫికెట్లు సమర్పించవచ్చన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించాలంటే సంబంధిత ఫామ్‌ ద్వారా క్షేత్రస్థాయి తనిఖీ ద్వారానే జరగాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బూత్‌ స్థాయి అధికారులే ఓటర్ల నమోదు ప్రక్రియ చేపడతారని, వలంటీర్లకు అవకాశం లేదని తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించామన్నారు. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయని, విచారణ జరిపి తప్పుడు ధ్రువీకరణ ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు