లైంగిక వేధింపుల నివారణకు వినూత్న కార్యక్రమం

11 Oct, 2022 20:07 IST|Sakshi

ప్రతి 15 రోజులకు ఫిర్యాదుల పరిష్కారం

పోస్టర్ల ద్వారా బాలికలకు అవగాహన 

కైకలూరు(పశ్చిమ గోదావరి జిల్లా): పాఠశాల స్థాయి నుంచే బాలికల రక్షణ, లైంగిక వేధింపుల నిరోధానికి వినూత్న కార్యక్రమానికి ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్‌తో మహిళలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోంది. ఇప్పుడు జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ– హైకోర్టు, రాష్ట్ర సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గోడపత్రికల ద్వారా లైంగిక వేధింపుల నివారణపై 18 సంవత్సరాలలోపు బాలికలకు అవగాహన కలిగిస్తున్నారు. బాలికలు తాము ఎదుర్కొన్న ఇబ్బందిని స్కూల్లోని ఫిర్యాదుల బాక్సు ద్వారా తెలియజేసేలా ఏర్పాటు చేస్తున్నారు.


ఎవరైనా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కొన్నిసార్లు ఎవరికి చెప్పాలో తెలియక బాలికలు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్‌ టచ్‌ అండ్‌ బ్యాడ్‌ టచ్‌పై ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి చేపడుతోంది. 18 సంవత్సరాల లోపు పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి పాఠశాల భద్రతా మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. ప్రతి పాఠశాలలోనూ పర్యవేక్షణ చేయడానికి భద్రతా కమిటీలను రూపొందించింది.  


ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు 

బాలికలు తాము ఎదుర్కొంటున్న లైంగిక సమస్యలను నిర్భయంగా కాగితంపై రాసి వేసేలా ఫిర్యాదుల పెట్టెను ప్రతీ పాఠశాలలోనూ ఏర్పాటు చేశారు. పాఠశాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బాక్సును అమర్చుతున్నారు. ఈ బాక్సుకు మూడు తాళం చేవులు ఉంటాయి. ప్రతీ 15 రోజులకు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను ఎంఈఓ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దారు వద్ద తెరిచి పరిష్కారాలను చూపుతారు. పెద్ద సమస్యను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువెళ్తారు. 


హెచ్‌ఎంలకు అవగాహన
 
బాలికలపై లైంగిక వేధిపుల నిరోధానికి ప్రభుత్వం పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తోంది. ఇటీవల ఈ అంశంపై మండల స్థాయిలో హెచ్‌ఎంలకు అవగాహన కలిగించారు. బాలికల శరీర భాగాలను తప్పుడు ఉద్దేశంతో ఎవరైన తాకితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. చైల్డ్‌ లైన్‌ – 1098, ఏపీ పోలీసు – 100, దిశ – 112, ఉమెన్‌ హెల్ప్‌ లైన్‌ – 181, ఎమర్జన్సీ – 108, మెడికల్‌ హెల్ప్‌ లైన్‌ – 104కు ఫిర్యాదు చేయాలని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.  

బాలికలలో తల్లిదండ్రులు గమనించాల్సినవి
ప్రవర్తనలో ఆకస్మిక మార్పు  
ఇతరుల నుంచి దూరంగా ఉండటం 
శరీర భాగాలలో అనుమానస్పద మార్పులు 
భయపడుతూ ఉండటం 
ఆహారం, నిద్రలో మార్పులు  

బాలికలకు బోధించాల్సినవి 
మీ హక్కులకు ఉల్లంఘన జరిగితే గట్టిగా మాట్లాడాలి 
ఎవరైన హద్దు మీరి ప్రవర్తిస్తే చురుగ్గా ప్రతిఘటించాలి  
లైంగిక వేధింపును ఎదుర్కొన్న తర్వాత అది వారి తప్పు కాదని గుర్తించేలా, అపరాధ భయాన్ని విడనాడేలా చేయాలి 
లైంగిక వేధింపులకు గురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులకు చెప్పేలా ప్రోత్సహించాలి 


ధైర్యంగా ఫిర్యాదు చేయాలి 

ప్రభుత్వం మహిళల రక్షణకు అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. దిశ యాప్‌ ద్వారా ఆపదలో మహిళలకు తక్షణ సాయం అందిస్తున్నారు. పాఠశాల స్థాయిలో లైంగిక వేధింపులకు గురైన బాలికలు ధైర్యంగా తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాలి. చేతులతో ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తగా గమనించాలి. ప్రభుత్వం అందిస్తున్న టోల్‌ఫ్రీ నెంబర్లుకు ఫోన్‌ చేయండి 
- కెఎల్‌ఎస్‌.గాయత్రీ, మహిళా ఎస్సై, కైకలూరు  


ప్రతి పాఠశాలలోనూ ఫిర్యాదుల పెట్టె  

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశాం. బాలికలు భయపడకుండా ఫిర్యాదులు వేసేలా నిర్మానుష్య ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పాం. ప్రతీ ఫిర్యాదును తహసీల్దారు సమక్షంలో విచారణ చేసి తక్షణ న్యాయం చేయనున్నాం. ఇటీవల హెచ్‌ఎంలకు వీటి నిర్వాహణపై శిక్షణ అందించాం.  
– డి.రామారావు, మండల విద్యాశాఖాధికారి, కైకలూరు

మరిన్ని వార్తలు