విద్యుత్‌ పొదుపులో కీలక మలుపు

10 Dec, 2021 04:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలో రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్‌ యూనిట్ల ఇంధన ఆదా

ఈ నెల 14 నుంచి 20 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు 

సాక్షి, అమరావతి: విద్యుత్‌ పొదుపులో రాష్ట్రం కీలక మైలు రాయిని అధిగమించి, సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాదిలో రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్‌ యూనిట్ల ఇంధనాన్ని ఆదా చేసింది. వార్షిక నివేదిక ప్రకారం ఇంధన శాఖ ఈ అంచనాకు వచ్చింది. పరిశ్రమలలో పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్‌ (పీఏటీ)లో భాగంగా ఇంధన పొదుపు కార్యక్రమాల అమలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు.. పట్టణాలు, గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, వ్యవసాయ పంపుసెట్ల పంపిణీ, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) పరికరాల ఏర్పాటు వంటి చర్యల కారణంగా రాష్ట్రం ఈ ఘనత సాధించింది.

ఇంతటితో సరిపెట్టుకోకుండా, సంపూర్ణ ఇంధనపొదుపు చర్యలను ఉద్యమంలా నిర్వహిస్తే రాష్ట్రంలో 15 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా చేసేందుకు అవకాశం ఉందని ఇంధన శాఖ చెబుతోంది. ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఇంధన పొదుపు వారోత్సవాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

అన్ని వర్గాల వారినీ ఇందులో భాగస్వామ్యం చేయనుంది. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించడంలో భాగంగా వారం పాటు ఎనర్జీ కన్జర్వేషన్‌ ర్యాలీ, ఎంఎంఎస్‌ఈ సెక్టార్‌లో ఐఓటీ టెక్నాలజీ, విద్యుత్‌ వాహనాలు, ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఈసీబీసీ), పీఏటీ వంటి అంశాలపై వెబ్‌నార్‌ లేదా వర్క్‌షాప్‌లను రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాష్ట్ర ఇంధన సంరక్షక మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) నిర్వహించనుంది. దీని కోసం జిల్లా స్థాయి నుంచి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది.

ప్రతిష్టాత్మకంగా వారోత్సవాలు 
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు–2021ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిందని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ అధికారులతో గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌ను అందించాలనేది సీఎం జగన్‌ లక్ష్యమన్నారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈసీఐ) నుంచి విద్యుత్‌ను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

మరిన్ని వార్తలు