హెచ్‌ఐవీ బాధిత ఎస్టీ కుటుంబాలకు చేయూత 

25 Jan, 2022 03:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తొలి విడతగా కృష్ణా జిల్లాలో 117 మందికి రూ.లక్ష చొప్పున మంజూరు 

ఆ మొత్తంతో స్వయం ఉపాధి పొందేలా పర్యవేక్షణ  

సాక్షి, అమరావతి: హెచ్‌ఐవీ బాధిత గిరిజన కుటుంబాలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేయూత అందిస్తోంది. హెచ్‌ఐవీ కారణంగా బతుకుదెరువు లేక మానసికంగా కుంగిపోకుండా వారిలో మనోధైర్యం నింపేలా ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. బాధితులు తమ కుటుంబాలను పోషించుకునేలా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేసి స్వయం ఉపాధి చూపించే చర్యలు చేపట్టింది.

ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే 117 మంది బాధితులను గుర్తించి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎస్టీల్లో హెచ్‌ఐవీ బాధితుల జాబితాలు పంపించాలని కలెక్టర్లను కోరామని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ప్రత్యేక శ్రద్ధతో ఎస్టీల్లో హెచ్‌ఐవీ బాధితులకు రూ.1.17 కోట్లు మంజూరయ్యాయని గిరిజన సంక్షేమ అధికారి ఎం.రుక్మాంగదయ్య చెప్పారు.  

మరిన్ని వార్తలు