Andhra Pradesh: ‘నికరం’గా ఆర్థిక వృద్ధి

19 Sep, 2022 03:39 IST|Sakshi
మూడేళ్లుగా రాష్ట్ర ఆర్ధిక నికర విలువ పెరుగుదల (రూ.కోట్లలో)

దన్నుగా వ్యవసాయం, తయారీ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు

ప్రస్తుత ధరలతో పోల్చితే రూ.10.85 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర ఆర్థిక నికర విలువ

మూడేళ్లలో రూ.2.94 లక్షల కోట్లు పెరుగుదల.. 37.28 శాతం వృద్ధి

వ్యవసాయ రంగంలో అత్యధికంగా రూ.3.72 లక్షల కోట్ల విలువ నమోదు

తయారీలో రూ.84,134 కోట్లు.. రియల్‌ ఎస్టేట్‌లో రూ.79,212 కోట్లు 

ఆర్బీఐ గణాంకాల నివేదికలో వెల్లడి.. అన్నదాతలకు గ్రామాల్లోనే అన్ని సేవలు

కోవిడ్‌ సంక్షోభంలోనూ పారిశ్రామిక ప్రగతి

పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలతో ఆర్థిక కార్యకలాపాలకు ఊతం ద్వారా వృద్ధి    

గత సర్కారు హయాంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ భారీ వృద్ధి 

రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.12,01,736 కోట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మూడేళ్లుగా వృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆర్థిక వృద్ధికి ప్రధానంగా వ్యవసాయం, తయారీ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే 2021–22 ఆర్థిక ఏడాది నాటికి రాష్ట్ర ఆర్థిక నికర విలువ (నెట్‌ స్టేట్‌ వ్యాల్యూ యాడెడ్‌) రికార్డు స్థాయిలో రూ.10.85 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం.

ఆర్థిక మందగమనం, వరుసగా రెండేళ్ల పాటు కరోనా సంక్షోభ పరిస్థితులను అధిగమించి గత మూడేళ్లలో రాష్ట్ర ఆర్థిక నికర విలువ 37.28 శాతం మేర పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి రూపొందించిన గణాంకాల నివేదికలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ అంశాలను వెల్లడించింది. రాష్ట్ర వృద్ధిపై పదేపదే వక్రభాష్యాలు చెబుతూ ఏ సంస్ధ ప్రకటించిన గణాంకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోందన్న ప్రశ్నకు ఆర్బీఐ నివేదిక చెంపపెట్టులా నిలుస్తోంది. 

సంక్షోభంలో అండగా..
2021–22 ఆర్థిక ఏడాదిలో వివిధ రాష్ట్రాలు ఆర్ధిక కార్యకలాపాల ద్వారా జోడించిన రాష్ట్ర నికర  విలువలను ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం గత మూడేళ్లగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనూ వేగంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమైంది.

2019–20లో ఆర్థిక మందగమనంతో పాటు ఆ తరువాత వరుసగా రెండేళ్లు కోవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ అన్నదాతలకు ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే అన్ని సేవలు అందిస్తూ వ్యవసాయానికి అండగా నిలవడం, పారిశ్రామిక ప్రగతి, పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తూ వివిధ రంగాల్లో నికర విలువను ప్రభుత్వం జోడించింది. ఇదే విషయాన్ని ఆర్బీఐ నివేదిక నిర్ధారించింది. 

మూడేళ్లలో రూ.2.94 లక్షల కోట్లు పెరుగుదల 
ప్రస్తుత ధరల ప్రకారం 2018–19లో రాష్ట్ర ఆర్థిక నికర విలువ రూ.7.90 లక్షల కోట్లు మాత్రమే ఉండగా 2021–22 నాటికి రూ.10.85 లక్షల కోట్లకు చేరిందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. మూడేళ్లలో నికర రాష్ట్ర ఆర్థిక విలువ రూ.2.94 లక్షల కోట్లు  పెరిగింది. అంటే మూడేళ్లలో 37.28 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. సగటు వార్షిక వృద్ధి 12.42 శాతంగా ఉంది. 

అగ్రస్థానంలో వ్యవసాయ రంగం 
2021–22 నాటికి రంగాల వారీగా చూస్తే అత్యధికంగా వ్యవసాయ రంగం రూ.3.72 లక్షల కోట్ల నికర ఆర్థిక విలువ నమోదు చేసింది. ఆ తరువాత తయారీ రంగం రూ.84,134 కోట్లు, రియల్‌ ఎస్టేట్‌ రంగం రూ.79,212 కోట్ల నికర ఆర్థిక విలువను నమోదు చేశాయి. నిర్మాణ రంగంలో రూ.72,190 కోట్ల నికర ఆర్థిక విలువ నమోదైంది. 2018–19లో వ్యవసాయ రంగం నికర ఆర్థిక విలువ రూ.2.61 లక్షల కోట్లు మాత్రమే ఉండగా 2021–22 నాటికి రూ.3.72 లక్షల కోట్లకు చేరింది.

అంటే మూడేళ్లలో వ్యవసాయ రంగం నికర ఆర్థిక విలువ 42.56 శాతం మేర పెరిగింది. వార్షిక సగటు వృద్ధి 12.42 శాతం పెరిగింది. తయారీ రంగం నికర ఆర్థిక విలువ 2018–19లో రూ.67,393 కోట్లు ఉండగా 2021–22 నాటికి రూ.84,134 కోట్లకు పెరిగింది. అంటే మూడేళ్లలో 24.8 శాతం మేర పెరిగింది. వార్షిక సగటు వృద్ధి 8.28 శాతంగా ఉంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం నికర ఆర్థిక విలువ 2018–19లో రూ.58,147 కోట్లు  ఉండగా 2021–22 నాటికి రూ.79,212 కోట్లకు పెరిగింది. మూడేళ్లలో రియల్‌ ఎస్టేట్‌ రంగం నికర ఆర్థిక విలువ 36.22 శాతం పెరిగింది. వార్షిక సగటు వృద్ది 12.07 శాతంగా ఉంది.
 

మరిన్ని వార్తలు