లంకెవాని దిబ్బలో ఆరుగురు సజీవ దహనం

31 Jul, 2021 07:04 IST|Sakshi

ప్రమాదం నుంచి బయటపడిన మరో నలుగురు

మృతులంతా ఒడిశా వలస కూలీలే

రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో ఘోర ప్రమాదం

రొయ్యల చెరువుల వద్ద షెడ్‌లో పేలుడు తరహాలో అగ్ని ప్రమాదం

రేపల్లె (గుంటూరు)/సాక్షి, అమరావతి: పగలంతా కాయకష్టం చేసి ఆదమరిచి నిద్రిస్తున్న ఆరుగురు యువకులు నిశిరాత్రి వేళ అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదం నుంచి మరో నలుగురు తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బ గ్రామంలోని రొయ్యల చెరువుల వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని రాయగఢ్‌ జిల్లా గునుపూర్‌ మండలానికి చెందిన 25 మంది యువకులు లంకెవానిదిబ్బలోని మండలి బెయిలీ అనే వ్యక్తికి చెందిన రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు 15 రోజుల క్రితం వచ్చారు. చెరువుల వద్ద ఉన్న షెడ్లలోనే వారంతా మకాం ఉంటున్నారు. ఎప్పటిమాదిరిగానే గురువారం చెరువుల్లోని రొయ్యలకు మేత వేశారు. రాత్రి వారంతా భోజనాలు చేసి షెడ్లలోని రెండు గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి వేళ షెడ్‌లోని ఒక గదిలో అకస్మాత్తుగా పొగలు కమ్ముకుని పేలుడు సంభవించగా, అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ గదిలో 10 మంది నిద్రిస్తుండగా.. మంటల్లో చిక్కుకుపోయిన నబీన్‌ సబార్‌ (23), పండబూ సబార్‌ (18), మనోజ్‌ సబార్‌ æ(18), కరుణకార్‌ సబార్‌ (18), రామ్మూర్తి సబార్‌ (19), మహేంద్ర సబార్‌ (20) అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అదే గదిలో నిద్రిస్తున్న సునామో కజ్జీ, రాహుల్‌ సబార్, సంతోషి సబార్, అశోక్‌సబార్‌ బయటకు పరుగులు తీసి ప్రాణాలతో బయటపడ్డారు. పక్క గదిలో నిద్రిస్తున్న మరో 15 కూడా భయంతో పరుగులు తీశారు.


ఘటన వెనుక అనుమానాలు
విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం సంభవించిందని కొందరు చెబుతుండగా.. ప్రమాదం జరిగిన గదిలో బ్లీచింగ్‌ బస్తాలు ఉన్నాయని, కూలీలు నిద్రపోయే సమయంలో మస్కిటో కాయిల్స్‌ వెలిగించారని.. వాటివల్ల ఆ గదిలోని బ్లీచింగ్‌ బస్తాలకు నిప్పంటుకుని ప్రమాదం సంభవించి ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. బ్లీచింగ్‌ బస్తాలు అంటుకుంటే పేలుడు ఎలా సంభవిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా బ్లీచింగ్‌ నిల్వ చేసిన గదుల్లో కూలీలు ఎలా నిద్రించగలరని, బ్లీచింగ్‌ వాసన ధాటికి తట్టుకోవడం కష్టమని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై శాస్త్రీయ పద్ధతుల్లో అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ చెప్పారు. చెరువుల యజమాని బెయిలీని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు. 

గవర్నర్‌ సంతాపం
ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విచారం వ్యక్తం చేశారు. ఆరుగురు యువకుల మరణంపై సంతాపం ప్రకటించిన గవర్నర్‌ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు