తెలంగాణను నియంత్రించండి

1 Jul, 2021 04:13 IST|Sakshi
సి.నారాయణరెడ్డి

నిబంధనలు ఉల్లంఘిస్తూ పులిచింతలలో విద్యుత్‌ ఉత్పత్తి 

అవసరం లేక పోయినా ఏకపక్షంగా దిగువకు నీరు విడుదల

బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేదు

కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్‌సీ లేఖ

సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్‌ ఉత్పత్తి చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. కృష్ణా డెల్టాలో పంటల సాగుకు నీటి అవసరాలు లేకున్నా.. నాగార్జునసాగర్, పులిచింతల నుంచి దిగువకు విడుదల చేసిన జలాలను తెలంగాణ కోటా కింద వినియోగించుకున్నట్టే లెక్కించాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయపురేకు ఏపీ జల వనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. 

► కృష్ణా డెల్టా నీటి అవసరాలను తీర్చేందుకు 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించాం. విభజన తర్వాత ఈ ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా 120 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ జల విద్యుత్‌ కేంద్రం తెలంగాణ అధీనంలో ఉంది.   
► కృష్ణా డెల్టాలో పంటల సాగుకు నీటిని విడుదల చేయాలని ఎస్‌ఈ (విజయవాడ) ప్రతిపాదనలు పంపినప్పుడు తెలంగాణ జెన్‌కో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేయాలన్నది ప్రాజెక్టు నియమావళి. 
► ప్రస్తుత ఖరీఫ్‌లో కృష్ణా డెల్టాలో పంటల సాగుకు నీటిని విడుదల చేయలేదు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ఎస్‌ఈ ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నా, మంగళవారం ఉదయం 8 గంటల నుంచి పోలీసు పహరా మధ్య తెలంగాణ జెన్‌కో అధికారులు ఏకపక్షంగా విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 
► బుధవారం నాటికి పులిచింతల ప్రాజెక్టులో 18.07 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసే ప్రకాశం బ్యారేజ్‌ నీటి నిల్వ సామర్యం 3.07 టీఎంసీలే. ఈ దృష్ట్యా కృష్ణా డెల్టాకు నీటి అవసరాలు లేకపోయినా పులిచింతల నుంచి నీటిని విడుదల చేయడం వల్ల.. ఆ నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా వృథాగా సముద్రంలోకి వదలాల్సి ఉంటుంది. 
► కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడానికి బోర్డు నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తోంది. తెలంగాణలో జల విద్యుత్‌ను వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలని గత నెల 28న ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జెన్‌కో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. ఈ దృష్ట్యా తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోండి. 

మరిన్ని వార్తలు