82.4 టీఎంసీలు తోడేసిన తెలంగాణ

25 Jul, 2021 02:50 IST|Sakshi
శ్రీశైలం డ్యామ్‌

ఈ మొత్తం నీటిని అక్రమంగా విద్యుదుత్పత్తికి వాడుకుంది

అందుకుగానూ ఏపీకి 160 టీఎంసీలు అదనంగా ఇవ్వండి

తక్షణమే తాగు, సాగునీటి అవసరాలకు 27 టీఎంసీల విడుదలకు ఉత్తర్వులు ఇవ్వండి

కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి లేఖ 

సాక్షి, అమరావతి: తాగు, సాగునీటి అవసరాలు లేనప్పటికీ.. కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్‌ 82.4 టీఎంసీలను అక్రమంగా వాడుకుని విద్యుదుత్పత్తి చేసిందని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసింది. తెలంగాణ సర్కార్‌ అక్రమంగా వాడుకున్న నీటికిగానూ.. 66:34 నిష్పత్తిలో అదనంగా తమకు 160 టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి శనివారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల్లో నీటిమట్టం కనీస స్థాయి దాటిందని వివరించారు. జూరాల, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయన్నారు. ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న నేపథ్యంలో తాగు, సాగునీటి అవసరాలకు తక్షణమే ఏపీకి 27 టీఎంసీలు(చెన్నైకి తాగునీరు 3, తెలుగుగంగకు 7, ఎస్సార్బీసీ/గాలేరు–నగరికి 8, కేసీ కెనాల్‌కు 2, హంద్రీ–నీవాకు 7 టీఎంసీలు) విడుదల చేస్తూ ఉత్తర్వులివ్వాలని లేఖలో కోరారు. 

లేఖలో ప్రధానాంశాలు..
► ప్రాజెక్టుల ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించి శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తున్న అంశాన్ని అనేకసార్లు కృష్ణా బోర్డు దృష్టికి తీసుకొచ్చాం. విద్యుదుత్పత్తిని ఆపేయాలని బోర్డు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ తుంగలో తొక్కింది. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలంలో 43.25, సాగర్‌లో 27.23, పులిచింతల ప్రాజెక్టులో 11.92 వెరసి 82.4 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంది. ఈ నీటిని ఆ రాష్ట్ర కోటా అయిన 299 టీఎంసీల్లో కలిపి లెక్కించాలి. 
► ప్రస్తుతం శ్రీశైలంలో 853.7 అడుగుల్లో 88.47, సాగర్‌లో 536.5 అడుగుల్లో 181.11, పులిచింతలలో 173.71 అడుగుల్లో 43.79 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో ఏపీకి 27 టీఎంసీలను విడుదల చేస్తూ ఉత్తర్వులివ్వాలి.

మరిన్ని వార్తలు