అట్టహాసంగా ముగిసిన పోలీస్‌ డ్యూటీ మీట్‌

8 Jan, 2021 08:18 IST|Sakshi
డ్యూటీ మీట్‌లో పోలీసుల గౌరవవందనం

13 జిల్లాల నుంచి తరలివచ్చిన పోలీస్‌ యంత్రాంగం

వివిధ పోటీల్లో విజేతలకు పతకాలు

ఆకట్టుకున్న విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు

మరువలేనిది టీటీడీ సహకారం

ఆధ్యాత్మికపురి.. తిరునగరి 2020 డ్యూటీమీట్‌కు వేదికగా నిలిచింది. ఇందుకు రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న పోలీసు యంత్రాంగం మొత్తం తరలివచ్చింది. విభిన్న రంగాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించింది.. ప్రతిభ చూపింది.. మీట్‌లో భాగంగా పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు కీర్తి దక్కగా.. మిగిలిన పోలీసు సిబ్బందిలో స్ఫూర్తి నిండింది.

సాక్షి, తిరుపతి ఎడ్యుకేషన్‌/తిరుపతి క్రైం : తిరుపతిలో నాలుగు రోజులుగా  నిర్వహించిన తొలి రాష్ట్ర పోలీస్‌ డ్యూటీ మీట్‌ గురువారం అట్టహాసంగా ముగిసింది. ఇగ్నైట్‌ 2020 పేరుతో నిర్వహించిన ఈ డ్యూటీ మీట్‌ పోలీసుల్లో స్ఫూర్తి నింపింది. రాష్ట్ర విభజనానంతరం తిరుపతి వేదికగా తొలిసారి నిర్వహించిన పోలీస్‌ డ్యూటీ మీట్‌కు 13 జిల్లాల నుంచి పోలీస్‌ శాఖలోని అన్ని విభాగాల నుంచి పెద్ద ఎత్తున పోలీస్‌ అధికారులు, సిబ్బంది తరలివచ్చారు. పోలీసుల్లోని సామర్థ్యాలు, ప్రతిభను వెలికి తీసేలా వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసులకు రాత పరీక్షలు నిర్వహించి, బంగారు, వెండి, కాంస్య పతకాలతో సత్కరించారు.  

అదరహో.. 
పోలీస్‌ డ్యూటీ మీట్‌లో భాగంగా పోలీస్‌ శాఖలోని ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఎస్‌డీఆర్‌ఎస్, ఇంటలిజెన్స్‌ విభాగాలు ప్రదర్శించిన ప్రత్యేక విన్యాసాలు సందర్శకులను కట్టి పడేశాయి. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనిపించాయి.   

టీటీడీ సహకారం భేష్‌ 
పెద్ద ఎత్తున తిరుపతిలో తొలిసారిగా నిర్వహించిన పోలీస్‌ డ్యూటీ మీట్‌ విజయవంతం కావడానికి టీటీడీ అందించిన సహకారం మరువలేదని తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి తెలిపారు. వివిధ జిల్లాల నుంచి పోలీస్‌ డ్యూటీ మీట్‌కు 1,560 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది వచ్చినట్లు పేర్కొన్నారు. వీరి వసతి కోసం టీటీడీ 138 గదులను కేటాయించడం అభినందనీయమన్నారు.

21 ఈవెంట్లలో పోటీలు
డ్యూటీ మీట్‌లో భాగంగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది కి 21 ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. ఇందులో 6 ఈవెంట్లు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో, మిగిలిన 15 ఈవెంట్లను పీటీసీలో నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 320 మంది పాల్గొన్నారు.

పోలీస్‌ డ్యూటీమీట్‌లో మెరిసిన చిత్తూరు
చిత్తూరు అర్బన్‌: తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్‌ డ్యూటీమీట్‌లో చిత్తూరుకు చెందిన పోలీసులు ప్రతిభ కనబరచారు. చిత్తూరు ఆర్ముడు రిజర్వు (ఏఆర్‌)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎస్‌ఎం జహీర్‌బాషా యాక్సెట్‌ కంట్రోల్‌ విభాగంలో బంగారు పతకం సాధించారు. అలాగే ఏఆర్‌ విభాగంలోని మరో కానిస్టేబుల్‌ కార్తీక్‌ వాహనాల తనిఖీ విభాగంలో వెండి పతకం సాధించారు. వీరిద్దరూ కూడా రాష్ట్ర హోంమంత్రి సుచరిత, డీఐజీ క్రాంతిరాణాటాటా, ఎస్పీ సెంథిల్‌కుమార్‌ చేతుల మీదుగా పతకాలు అందుకున్నారు. 

దిశ.. ఆమెకు రక్ష

పోలీసు స్టోరీతోనే హీరో అయ్యా..
ఇగ్నైట్‌లో పాల్గొనడం నా అదృష్టం 
‘సాక్షి’ ఇంటర్వ్యూలో సినీహీరో సాయికుమార్‌  

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం వారి పాలిట రక్షణ కవచమేనని సినీ హీరో సాయికుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి వేదికగా జరుగుతున్న ఏపీ స్టేట్‌ పోలీస్‌ డ్యూటీ మీట్‌ ‘ఇగ్నైట్‌’ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన సందర్భంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థపై, పాలనాపరమైన అంశాలపై తన మనోభావాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. 

కరోనా కాలం ఎలా గడిచింది ? 
సాయికుమార్‌: ఇదొక విపత్కర పరిస్థితి. సామాన్యుడి నుంచి ధనికుల వరకు ప్రతి వ్యక్తినీ కరోనా వైరస్‌ కష్టపెట్టింది. కళామతల్లి బిడ్డలు చాలామంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసు వ్యవస్థ, పంచాయతీ కార్మికులు, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ చేసిన సేవలు ప్రజలు మరువరు.

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారా? 
సాయి: శ్రీవారి ఆశీస్సులతో 1972 నుంచి బాల నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా అంచెలంచెలుగా ఎదిగాను. పోలీస్‌ స్టోరీ సినిమాతో హీరోగా ప్రజలు ఆశీర్వదించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ భగవంతుని దయతో ఏటా సినిమాలు, టీవీ ప్రోగ్రాంలతో జీవితం బీజీగా గడుస్తోంది. ప్రస్తుతం మళయాల సినిమా ‘చేక్‌తల్లీఖాన్‌ ఐపీఎస్‌’లో నటిస్తున్నాను.

దిశ చట్టంపై మీ అభిప్రాయం? 
సాయి: సమాజంలో కొంత మంది చట్టాలను చుట్టాలుగా చేసుకుని మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుండడంతో వారి జీవితాలు సర్వ నాశనమవుతున్నాయి. అటువంటి సంఘటనలు జరగకుండా, ఒక వేళ జరిగినా వెంటనే నిందితులకు కఠిన శిక్షలు పడేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టాన్ని తీసుకురావడం సంతోషదాయకం. అసెంబ్లీలో చట్టం ఆమోదించడం చారిత్రాత్మకం. దిశ చట్టం అతివలకు రక్షణ కవచంగా నిలుస్తుంది.

డ్యూటీ మీట్‌లో మీ అనుభూతి ఏమిటి?
సాయి: పోలీసుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఏర్పాటు చేసిన ఇగ్నైట్‌ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వచ్చాను. పోలీసు డ్యూటీ మీట్‌లో ఎంతోమంది అధికారులు, సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకుని ప్రదర్శనలను ఇచ్చారు. ప్రతి పోలీసు అధికారికీ ఈసందర్భంగా సెల్యూట్‌ చేస్తున్నాను.

ఏపీ పోలీసు వ్యవస్థపై మీ అభిప్రాయం?
సాయి: దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ పోలీసు నంబర్‌ వన్‌గా నిలవడం గర్వకారణం. దేశంలో ఏపీ పోలీసు 108 పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్‌ గౌరవాన్ని ఇనుమడింపజేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మీ స్పందన ? 
సాయి: మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత. సంక్షేమ ఫలాలు చిట్టచివరి లబ్ధిదారుని వరకు అవినీతి రహితంగా చేరినప్పుడే ఆ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. సీఎం జగన్‌కి మరోసారి ప్రజలు బ్రహ్మరథం పడతారు.

మరిన్ని వార్తలు