అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ వినియోగంలో ఏపీ నంబర్‌ 1

31 Jul, 2022 09:52 IST|Sakshi
కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చేతుల మీదుగా బెస్ట్‌ స్టేట్‌ అవార్డు అందుకుంటున్న రాష్ట్ర రైతు బజార్ల సీఈవో బి.శ్రీనివాసరావు

కేంద్ర మంత్రి నుంచి అవార్డు అందుకున్న రైతు బజార్ల సీఈవో

రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

రూ.2,706 కోట్లతో 39,403 సదుపాయాలకు ప్రణాళిక

తొలి విడతగా రూ.1,584.6 కోట్లు మంజూరు

10,677 మౌలిక సదుపాయాల కల్పన

సాక్షి, అమరావతి: వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధుల (అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌) వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ క్షేత్రం (ఫామ్‌ గేట్‌) వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూ ఉత్తమ రాష్ట్రంగా ఆవిర్భవించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో అగ్రి ఫండ్స్‌ వినియోగంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రం అవార్డును కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ శనివారం న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రైతుబజార్ల సీఈవో బి.శ్రీనివాసరావుకు అందజేశారు. అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్స్‌ వినియోగంలో అనేక రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఈ నిధులను వినియోగించుకొని గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అగ్ర స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి  నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రశంసించారు.

రూ.2,706 కోట్లతో 39,403 మౌలిక సదుపాయాలు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రం వద్ద బహుళ ప్రాయోజిత కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.  పీఎసీఎస్‌ ద్వారా ఆర్బీకే స్థాయిలో 4,277 గోదాములు – డ్రయింగ్‌ ప్లాట్‌ఫారాలు,  ఏపీ సీవిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ కోసం 60 బఫర్‌ గోడౌన్లు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ కోసం 830 క్లీనర్స్, 4,277 డ్రయింగ్‌ ప్లాట్‌ఫారాలు, 2,977 డ్రయర్లు, 101 పసుపు పాలిషర్స్‌ ఏర్పాటు చేసింది. ఉద్యాన ఉత్పత్తుల కోసం 945 కలెక్షన్‌ సెంటర్లు, 344 కూల్డ్‌ రూమ్స్, ఆర్బీకేలకు అనుబంధంగా 10,678 ఎస్సైయింగ్‌ పరికరాలు, 10,678 ప్రొక్యూర్‌మెంట్‌ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఇలా 39,403 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,706 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి విడతగా 1,305 పీఏసీఎస్‌ల పరిధిలో 10,677 మౌలిక సదుపాయాల కల్పనకు అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ కింద రూ.1,584.6 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 

మరిన్ని వార్తలు