AP: రాష్ట్రంలో పెరిగిన అమ్మాయిల సంఖ్య

3 Jan, 2022 08:43 IST|Sakshi

దేశంలోనూ వారిదే హవా 

రాష్ట్రంలో వెయ్యి మంది అబ్బాయిలకు 1,045 అమ్మాయిలు 

దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 1,020 

రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పెరుగుదల నమోదు 

3 జిల్లాల్లో మాత్రం తగ్గుదల నమోదు 

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి 

‘లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అన్నాడో సినీ కవి. ‘అన్నిటా సగం.. ఆకాశంలోనూ తాను సగం’ అన్నట్టుగా వివిధ రంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలు.. సంఖ్యాపరంగానూ పురుషుల్ని దాటేస్తున్నారు. అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోను అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా నమోదైంది. దేశంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు 2 శాతం అధికంగా ఉండగా.. రాష్ట్రంలో 4.5 శాతం అధికంగా ఉన్నట్టు తాజా సర్వే తేల్చింది. 

సాక్షి, అమరావతి: నాలుగేళ్ల క్రితం నాటి లెక్కలతో పోలిస్తే దేశంలోను, రాష్ట్రంలోను అమ్మాయిల సంఖ్య పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వెయ్యి మంది అబ్బాయిలకు 991 మంది అమ్మాయిలు మాత్రమే ఉండేవారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 1,020కి పెరిగింది. అయితే, దేశవ్యాప్తంగా పట్టణాల్లో అమ్మాయిల సంఖ్య వెయ్యి మంది అబ్బాయిలకు 985 మాత్రమే ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వెయ్యి మంది అబ్బాయిలకు 1,037 మంది అమ్మాయిలు ఉన్నట్టు తేలింది. 

దేశ సగటుతో పోలిస్తే ఏపీలో ఎక్కువే 
రాష్ట్రంలో 2015–16లో వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలు ఉండగా.. 2019–20లో ఆ సంఖ్య 1,045కు చేరింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య  1,024 చొప్పున నమోదు కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది అబ్బాయిలకు 1,055 మంది అమ్మాయిలు ఉన్నట్టు తేలింది. కాగా, 2015–16 ఆరి్థక సంవత్సరంతో పోలిస్తే 2019–20లో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా, చిత్తూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2015–16తో పోలిస్తే 2019–20లో అమ్మాయిల సంఖ్య తగ్గింది.

మరిన్ని వార్తలు