ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు 

19 Jun, 2021 16:06 IST|Sakshi

జూన్‌ 21 నుంచి 30 వరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మినహాయింపు 

సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కచ్చితంగా అమలు

పూర్తి స్థాయిలో పని చేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు 

సాయంత్రం 5 గంటలకు దుకాణాలను మూసివేయాలి

తూ.గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు

కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం నిర్ణయం  

350 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు వేగవంతం 

గణనీయంగా తగ్గిన కోవిడ్‌ కేసులు 

పాజిటివిటీ రేటు 5.99 శాతం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. కర్ఫ్యూ సడలింపు ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు ఉండగా, ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కచ్చితంగా అమలు చేయనున్నారు.

కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కర్ఫ్యూ సడలింపు ఇదివరకటి లాగే (ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మినహాయింపు) కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్‌ టైమింగ్స్‌ అమలు చేయాలని, ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. దుకాణాలను మాత్రం సాయంత్రం 5 గంటలకే మూసి వేయనున్నారు. కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఆస్పత్రుల్లో క్రయోజనిక్‌ ట్యాంకర్లు
ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ జనరేషన్‌ యూనిటే కాకుండా క్రయోజనిక్‌ ట్యాంకర్లను పెట్టాల్సిందిగా సీఎం ఆదేశించారు. దీనివల్ల పూర్తి స్థాయిలో ఆక్సిజన్‌ సరఫరాకు భరోసా ఉంటుందన్నారు.  వీటితోపాటు డి–టైప్‌ సిలెండర్లు కూడా ఉంచడం వల్ల మూడు ఆక్సిజన్‌ నిల్వలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రోగులకు ఆక్సిజన్‌ అందించడంలో సమర్థవంతమైన ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని స్పష్టం చేశారు.

కొత్తగా నిర్మించదలచిన 350 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనివల్ల మెడికల్‌ ఆక్సిజన్‌ విషయంలో రాష్ట్రానికి స్వయంసమృద్ధి వస్తుందని పేర్కొన్నారు. అవసరం లేని సమయంలో ఆ ప్లాంట్‌ నుంచి వచ్చే ఆక్సిజన్‌ను పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు. ప్రతి 100 బెడ్లు, ఆపై పడకలున్న ఆస్పత్రుల వద్ద 10 కిలో లీటర్ల ఆక్సిజన్‌ ట్యాంకులను స్టోరేజీ కింద పెడుతున్నామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్‌ నియంత్రణ చర్యలు, థర్డ్‌ వేవ్‌ సన్నద్ధత గురించి వివరించారు. ఈ సమావేశంలో ఉప మఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.    

ఇదీ ప్రస్తుత పరిస్థితి
– మరణాల రేటును నియంత్రించడంలో ఏపీకి దేశంలో రెండో స్థానం. 
– పాజిటివిటీ రేటు 5.99 శాతం. రికవరీ రేటు 95.53 శాతాతం. మరణాల రేటు 0.66 శాతం.
– యాక్టివ్‌ కేసులు ప్రస్తుతం 69,831.
– అందుబాటులో 2,562 ఐసీయూ బెడ్లు.
– అందుబాటులో 13,738 ఆక్సిజన్‌ బెడ్లు. మే 17న 433 మాత్రమే. 
– 12 వేలకు పైగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన జనరల్‌ బెడ్లు. మే 14న 4978 మాత్రమే.
– కర్నూలు జిల్లాలో అతి తక్కువగా పాజిటివిటీ రేటు 2.58 శాతం, అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 12.25 శాతం. 
– ఆరోగ్య శ్రీ కవరేజీ ఆస్పత్రుల్లో 90.54 శాతం బెడ్లలో ఈ పథకం కింద రోగులకు చికిత్స. 
– కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు కేవలం 7,056 మాత్రమే.
– 104 సెంటర్‌కు కోవిడ్‌ కాలంలో గరిష్టంగా 19,175 కాల్స్, ప్రస్తుతం 1582 కాల్స్‌. 
– రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,584 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, 185 మంది మృతి.. 966 మంది డిశ్చార్జ్‌.
– థర్డ్‌వేవ్‌కు సన్నద్ధతలో భాగంగా జూలై 15 నాటికి రాష్ట్రానికి రానున్న 12,187 ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు.
– జూన్‌ 24 నాటికి రాష్ట్రానికి రానున్న 10 వేల డి టైప్‌ సిలిండర్లు.
– 50 బెడ్లు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సదుపాయం ఏర్పాటుకు చర్యలు.
– జూలై 5 నాటికి రాష్ట్రానికి చేరనున్న మరో 20 ఐఎస్‌ఓ ట్యాంకర్లు.  

చదవండి: తగ్గిందని అలసత్వం వద్దు

>
మరిన్ని వార్తలు