నేరాల నియంత్రణలో ఏపీ భేష్‌

16 Sep, 2021 02:43 IST|Sakshi

రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన నేరాలు

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వార్షిక నివేదిక–2020లో వెల్లడి

2019 కంటే 2020లో 15 శాతం తగ్గిన నేరాలు

2018తో పోలిస్తే 20 శాతం తగ్గుదల

శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పనితీరు

అక్రమ దందాలపై ఉక్కుపాదం

సాక్షి, అమరావతి: నేరాల కట్టడి, శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి శభాష్‌ అనిపించుకుంది. ప్రజలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పనితీరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రంలో నేరాలు తగ్గాయని కేంద్ర హోం శాఖకు చెందిన ‘జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వార్షిక నివేదిక–2020’లో ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. 2020లో దేశవ్యాప్తంగా నేరాలకు సంబంధించిన కేసులు, గణాంకాలను క్రోడీకరించి ఎన్‌సీఆర్‌బీ ఈ నివేదికను బుధవారం విడుదల చేసింది.

2019తో పోలిస్తే 2020లో ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు 15 శాతం తగ్గాయని ఈ నివేదిక వెల్లడించడం విశేషం. 2018తో పోలిస్తే నేరాలు 20 శాతానికిపైగా తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది. హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, అత్యాచార యత్నాలు, మహిళలపై ఇతరత్రా వేధింపులు, దోపిడీలు, ఎస్టీ, ఎస్సీలపై నేరాలు ఇలా అన్నీ తగ్గాయి. 2020లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా లాక్‌డౌన్, కర్ఫ్యూలను అమలు చేసేందుకు పోలీసులు నమోదు చేసిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఇసుక, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉద్దేశించిన కేసులు కూడా అధికమే. ఈ కేసులు శాంతిభద్రతలకు సంబంధించినవి కావని ఎన్‌సీఆర్‌బీ స్పష్టం చేసింది. ఎన్‌సీఆర్‌బీ నివేదికలోని ప్రధాన అంశాలు..

నేర స్వభావం ఉన్న కేసులు తక్కువే..
2019లో రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ల కింద 1,19,229 కేసులు నమోదయ్యాయి. కాగా, 2020లో 1,88,997 కేసులు నమోదు చేశారు. కానీ వాటిలో 88,377 కేసులు కరోనా కట్టడి కోసం నమోదు చేసిన కేసులే. అంటే.. లాక్‌డౌన్, కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల మీద తిరుగుతున్నవారు, అనుమతించిన సమయం దాటాక కూడా దుకాణాలు నిర్వహించినవారిపై నమోదైన కేసులే అవి. వాటిని మినహాయిస్తే నేర స్వభావం ఉన్న కేసులు కేవలం 1,00,620 మాత్రమే. అంటే.. 2019 కంటే 2020లో 18,609 కేసులు తగ్గాయి. తద్వారా రాష్ట్రంలో నేరాలు 15 శాతం తగ్గిపోయాయి. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2018లో అయితే రాష్ట్రంలో 1,26,635 కేసులు నమోదయ్యాయి. వాటితో పోలిస్తే 2020లో నేర స్వభావం ఉన్న కేసులు 26,015 తగ్గడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సమర్థ పనితీరుకు నిదర్శనం.

ఫిర్యాదులపై సత్వర స్పందన
వివిధ ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరం స్పందించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తోందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. 2020లో రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు వివరాలు ఇలా ఉన్నాయి..

అక్రమ దందాకు అడ్డుకట్ట
ఇసుక, మద్యం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పనితీరును కనబర్చిందని ఎన్‌ఎసీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసి మరీ ఈ అక్రమ దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ దందాను అరికట్టేందుకు.. చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు నమోదు చేసే ఎస్‌ఎల్‌ఎల్‌ క్రైమ్‌ (నాన్‌ కాగ్నిజిబుల్‌) కేసులు పెరగడమే దీనికి తార్కాణం. 2019తో పోలిస్తే 2020లో ఇలాంటి కేసులు పెరిగాయి. 2019లో 26,522 కేసులు నమోదు కాగా.. 2020లో 49,108 కేసులు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు