ధాన్యం రైతుకు డబ్బులు!

21 Jul, 2021 04:12 IST|Sakshi

అన్నదాతలకు చెల్లించేందుకు రూ.1,600 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

2020–21 రబీలో 2,90,203 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు

రూ.6,628.34 కోట్ల విలువైన 35.40 లక్షల టన్నుల సేకరణ

ఇప్పటిదాకా రూ.5,056.76 కోట్లు బకాయిపడిన కేంద్రం

కేంద్రం జాప్యంతో రైతులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

నాబార్డు నుంచి రుణం తీసుకుని నేటి నుంచి రైతన్నలకు చెల్లింపులు  

సాక్షి, అమరావతి: ధాన్యం రైతన్నలకు శుభవార్త! కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ అన్నదాతలకు చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.1,600 కోట్లను విడుదల చేసింది. ధాన్యం కొనుగోలు చేసి 21 రోజులు దాటిన రైతుల ఖాతాలకు రూ.1,207 కోట్లను బుధవారం నుంచి జమ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలిపారు. మిగిలిన రైతులకు కూడా సకాలంలో చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్రం బకాయిపడిన రూ.5,056.76 కోట్లను ఇంకా విడుదల చేయనప్పటికీ, కరోనా ప్రతికూల పరిస్థితులతో ఆర్థిక సమస్యలున్నా రైతన్నలు ఏమాత్రం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు నుంచి రుణం తీసుకుని చెల్లింపులు చేస్తుండటాన్ని రైతు సంఘాల నేతలు ప్రశంసిస్తున్నారు. కళ్లాల వద్దే కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం వల్ల గిట్టుబాటు ధర దక్కడంతోపాటూ రవాణా ఖర్చుల రూపంలో క్వింటాలుకు రూ.వంద వరకూ ఆదా అవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సర్కార్‌ హయాంలో రైతులకు బకాయిపడిన రూ.4,838.03 కోట్లను కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేసుకుంటున్నారు. 

35.40 లక్షల టన్నులు కొనుగోలు... 
రబీలో 21.75 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా సుమారు 65 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా భారీ ఎత్తున కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. ధాన్యాన్ని సాధారణ రకం టన్ను రూ.1,868, ఏ–గ్రేడ్‌ రకం రూ.1,888 చొప్పున కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయడం వల్ల మిల్లర్లు, వ్యాపారులు అదే ధరకు కొనాల్సిన పరిస్థితిని కల్పించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకూ రైతు భరోసా కేంద్రాల ద్వారా కళ్లాల వద్దే 2,90,203 మంది రైతుల నుంచి 35,40,573.96 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. 

కేంద్రం బకాయిలు విడుదల కాకున్నా.. 
రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యానికి బియ్యం రాయితీ రూపంలో పౌరసరఫరాల శాఖకు కేంద్రం రూ.5,056.76 కోట్లు బకాయిపడింది. రబీలో భారీ ఎత్తున రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, బకాయిలు విడుదల చేస్తే సకాలంలో చెల్లింపులు చేస్తామని జూన్‌ 11న ఢిల్లీలో కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. అయితే కేంద్రం నుంచి బకాయిల విడుదలలో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ఖజానా నుంచి, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని చెల్లింపులు చేశారు. రబీలో ఇప్పటిదాకా కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.6,628.34 కోట్లు కాగా ఇప్పటికే రూ.3,266.70 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించింది. ఇందులో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల లోపు జరిపిన చెల్లింపులు రూ.1,637 కోట్లు ఉండడం గమనార్హం. 

రైతన్నలు ఇబ్బంది పడకుండా.. 
ధాన్యం రైతులకు ఇంకా రూ.3,361.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ధాన్యం విక్రయించి 21 రోజులు పూర్తయిన రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.1,207 కోట్లు ఉంది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నాబార్డు నుంచి రుణం తీసుకుని రైతులకు చెల్లింపులు చేయాలని పౌరసరఫరాలశాఖను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. రూ.1,600 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిన నాబార్డు నిధులను విడుదల చేయడంతో బుధవారం నుంచి రైతులకు చెల్లింపులు జరిపేలా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. 

నాడు దళారులు, మిల్లర్లు చెప్పిందే ధర.. 
టీడీపీ అధికారంలో ఉండగా జూన్‌ 2014 నుంచి మే 2019 వరకూ ఏనాడూ సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అరకొర కొనుగోళ్లకూ చెల్లింపులు చేయకుండా మూడు నుంచి ఆర్నెళ్ల పాటు జాప్యం చేసింది. దీంతో దళారులు, మిల్లర్లు తక్కువ ధరకే ధాన్యాన్ని సేకరించి రైతుల శ్రమను దోపిడీ చేశారు.  2018–19 రబీలో కొనుగోలు చేసిన 27.52 లక్షల టన్నుల ధాన్యానికి చెల్లించాల్సిన రూ.4,838.03 కోట్లను నాటి సీఎం చంద్రబాబు ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించి రైతులను ముంచేశారు. ఆ బకాయిలను ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక చెల్లించారు. 

రెండేళ్లలోనే రూ.35,371.09 కోట్ల ధాన్యం కొనుగోలు.. 
టీడీపీ ఐదేళ్ల పాలనలో రబీ, ఖరీఫ్‌తో కలిపి రూ.37,698.77 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.35,371.09 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనడం గమనార్హం. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు రైతులకు సకాలంలో రూ.32,009.45 కోట్లను చెల్లించింది. మిగతా రూ.3,361.64 కోట్లను కూడా చెల్లించేందుకు చర్యలు చేపట్టింది.  

మరిన్ని వార్తలు