234 ఖనిజ లీజులకు ఈ–వేలం

6 Jul, 2022 04:47 IST|Sakshi

అందులో 169 గ్రానైట్‌ గనులే

వేలంలో సొంతం చేసుకున్న వారికి త్వరితగతిన అనుమతులు

సాధ్యమైనన్ని గనుల్ని ఆపరేషన్‌లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు చిన్న తరహా ఖనిజాల తవ్వకానికి లీజు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ–వేలం కొనసాగుతోంది. తొలి దశలో 234 ఖనిజాలకు క్వారీ లీజులు ఇచ్చేందుకు గనుల శాఖ జిల్లాలవారీగా టెండర్లు పిలిచింది. అందులో 169 కలర్‌ గ్రానైట్‌వే. మిగిలినవి క్వార్‌ట్ట్జ, బ్లాక్‌ గ్రానైట్, బెరైటీస్, సిలికా శాండ్, ప్రొఫలైట్‌ ఖనిజ లీజులు.

అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 70 క్వారీ లీజులకు ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 54, విజయనగరం జిల్లాలో 35, వైఎస్సార్‌ జిల్లాలో 31, కర్నూలు జిల్లాలో 18, నెల్లూరు జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 8 లీజులకు వేలం నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్నిటికి ఇప్పటికే అనుమతులు కూడా మంజూరు చేశారు. మరికొన్నింటికి త్వరలో మంజూరు చేయనున్నారు. 

గతంలో ఉన్న మైనింగ్‌ విధానం ప్రకారం లీజు దరఖాస్తులు సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉండిపోయేవి. లీజులు తీసుకున్న వారిలో ఎక్కువ మంది తవ్వకాలు జరపకుండా వదిలేసేవారు. అలాంటివి 2,162 లీజులు ఉన్నట్లు గుర్తించారు. అనుమతిచ్చిన ఈ క్వారీల్లో తవ్వకాలు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నిలిచిపోయింది. మైనింగ్‌ ఆధారిత పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడింది.

ఈ నేపథ్యంలో తవ్వకాలు జరపని క్వారీలకు ఒక అవకాశం ఇచ్చి చూశారు. అప్పటికీ సద్వినియోగం చేసుకోకపోవడంతో ఆ లీజులను రద్దు చేసి వాటికి ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం వెయ్యి క్వారీలను తిరిగి ఆపరేషన్‌లోకి తేవాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి దశలో 234 లీజులకు ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఇందులో అనుమతి పొందిన వారికి రెవెన్యూ శాఖ నుంచి త్వరితగిన నిరభ్యంతర పత్రాలు ఇప్పించంతోపాటు ఇతర అనుమతులూ త్వరగా వచ్చేలా చూస్తున్నారు. 

మరిన్ని వార్తలు