గిరిజనుల స్వయం ఉపాధికి సర్కార్‌ కృషి

12 Jan, 2022 05:03 IST|Sakshi
మిల్లెట్‌ బిస్కెట్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కాంతిలాల్‌ దండే

గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే

విశాఖ జిల్లా డుంబ్రిగుడ వద్ద మిల్లెట్‌ బిస్కెట్‌ తయారీ కేంద్రం ప్రారంభం  

డుంబ్రిగుడ/అరకులోయ రూరల్‌: అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజనుల స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే చెప్పారు. విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు జీసీసీ గోడౌన్‌లో కొర్రాయి వీడీవీకే ఏర్పాటు చేసిన బిస్కెట్‌ తయారీ కేంద్రాన్ని ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణ, అరకు ఎమ్మెల్యే ఫాల్గుణతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కాంతీలాల్‌ దండే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కృషితో కేంద్ర ప్రభుత్వం 350 వన్‌ధన్‌ వికాస కేంద్రాలను ఏపీకి మంజూరు చేసిందన్నారు. సీతంపేట, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అటవీ ఉత్పతులకు అదనపు విలువ జోడించి ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. వీటిని కాటేజీ పరిశ్రమ కిందకు మారిస్తే విద్యుత్‌ రాయితీ పొందవచ్చని సూచించారు. ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి  ప్రభుత్వం అన్ని విధాలా తగిన సహకారం అందిస్తోందన్నారు.

అనంతరం కాంతీలాల్‌ దండే కుటుంబ సమేతంగా అరకులోయను సందర్శించారు. గిరి గ్రామదర్శినిలో  కాంతిలాల్‌ దంపతులకు గిరిజన సంప్రదాయ దుస్తులు వేసి మరోసారి పెళ్లి తంతు జరిపించారు. సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్న ఈ రోజుల్లో గిరి గ్రామదర్శిని నిర్వహణ అభినందనీయమన్నారు.  పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ చట్టారి జానకమ్మ, ఎంపీపీ బాక ఈశ్వరి, సర్పంచ్‌ శారద పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు