Dragon Fruit: వాణిజ్య పంట సాగు చేద్దామా..!

17 Aug, 2022 17:41 IST|Sakshi

డ్రాగన్‌తోట పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం 

ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

రాజాం సిటీ: ఇప్పుడిప్పుడే రైతులకు సుపరిచితమౌతున్న వాణిజ్యపంట డ్రాగన్‌ ఫ్రూట్‌. ఎక్కడో మెక్సికో, సెంట్రల్‌ అమెరికాలో పుట్టిన ఈ పంట ఇప్పుడు పల్లెలకు సైతం పాకుతోంది. ఈ పంట ద్వారా రైతులను ప్రోత్సహించేందుకు తోటల పెంపకానికి ఉపాధిహామీ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాణిజ్యపంటలపై అవగాహనతోపాటు సాగుచేసేందుకు ఆసక్తి ఉన్న రైతులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. వాణిజ్యపంటగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న డ్రాగన్‌ తోటల పెంపకానికి సంబంధించి మూడేళ్లపాటు నిర్వహణకు నిధులు అందించనుంది. 

ఉపాధి పథకంలో జాబ్‌ కార్డు కలిగిఉండడంతో పాటు 50 సెంట్ల భూమి ఉన్న రైతులు ఈ తోలట పెంపకానికి దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. ఈ విధంగా వాణిజ్యపంటలపై రైతులను ప్రోత్సహించడంతోపాటు వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీని నిర్వహణకు మూడేళ్లపాటు ఉపాధి పనుల్లో భాగంగా ప్రభుత్వం రూ. 3  లక్షల వరకు నిధులు సమకూర్చనుంది. అర్హులైన రైతులంతా ఈ తోటల పెంపకానికి ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.  

ప్రోత్సాహం ఇలా.. 
పొలంలో ఏర్పాటుచేసుకున్న డ్రాగన్‌ తోటలకు వరుసగా మూడేళ్లపాటు రూ.3,08,722 వరకు రైతుకు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది.  ఈ మొత్తాన్ని వేతనదారులకు రూ. 71,420లు, మెటీరియల్‌ ఖర్చుకు సంబంధించి రూ. 2,37,302లు అందజేయనుంది.   

రైతులు సద్వినియోగం చేసుకోవాలి 
ప్రభుత్వం ఉపాధిహామీ ద్వారా డ్రాగన్‌ తోటల పెంపకానికి కల్పిస్తున్న అవకాశాన్ని అర్హులైన రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధిలో జాబ్‌కార్డు కలిగిఉండడంతో పాటు 50 సెంట్ల భూమి ఉన్న వారంతా తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పొలానికి భూసార పరీక్ష చేయించుకోవాలి. మూడేళ్లపాటు తోటల నిర్వహణకు రూ.3 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నాం. దీనికి అయ్యే పెట్టుబడిని రైతులే ముందుగా పెట్టుకోవాలి.  
- జి.ఉమాపరమేశ్వరి, పీడీ, డ్వామా  

మరిన్ని వార్తలు