లోటు ఉన్నా రుణాల చెల్లింపు

26 Mar, 2022 04:38 IST|Sakshi

చేసిన అప్పులతో భారీగా ఆస్తుల కల్పన

2020–21లో రూ.13,735 కోట్లు రుణం తీర్చిన ప్రభుత్వం

సాధారణంగా రెవెన్యూ మిగులు ఉంటేనే రుణాల చెల్లింపులు

కానీ రూ.35,540 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నా రుణాల చెల్లింపు

2020–21లో అప్పు చేసిన రూ.57,436 కోట్లలో రూ.20,690 కోట్లతో ఆస్తుల కల్పన

కాగ్‌ నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: రెవెన్యూ లోటు భారీగా ఉన్నప్పటికీ రుణ భారాన్ని తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరోపక్క, తెచ్చిన అప్పులతో ఆస్తుల కల్పనకూ ప్రాధాన్యతనిస్తోంది. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. సాధారణంగా ప్రభుత్వాలు మిగులు రెవెన్యూ ఉన్నప్పుడు రుణాలు చెల్లిస్తాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం భారీ రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ అప్పులు తీరుస్తోందని తెలిపింది. 2020–21లో రూ.35,540 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.13,735 కోట్ల ప్రభుత్వ రుణాలు చెల్లించినట్లు ఆ నివేదికలో పేర్కొంది. వడ్డీలతో కలిపి మొత్తం రూ.20,018 కోట్లు రుణ చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించిందని తెలిపింది.

ఆస్తుల కల్పనకు ప్రాధాన్యత
ఒక పక్క కోవిడ్‌తో ఆదాయం తగ్గిపోతున్నప్పటికీ ఆస్తుల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని కాగ్‌ వెల్లడించింది. 2020–21లో రూ.57,436 కోట్ల రుణాలు తీసుకోగా, ఇందులో రూ.20,690 కోట్లు ఆస్తుల కల్పనలో భాగంగా మూలధన వ్యయానికి వినియోగించినట్లు పేర్కొంది. ఇందులో రూ.1,715 కోట్లు రుణ చెల్లింపులకు పోగా నికరంగా రూ.18,975 కోట్లు ఆస్తుల కల్పనకు వినియోగించింది. ఇందులో రూ.3,969 కోట్లు జలవనరుల ప్రాజెక్టులకు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ.591 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.738 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా పథకాలకు రూ.509 కోట్లు వినియోగించినట్లు పేర్కొంది.

ఇతర ఆస్తుల కల్పనకు రూ.13,133 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపింది. గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం సాధారణ, సామాజిక సేవల రంగంలో మూలధన వ్యయం భారీగా పెంచినట్లు కాగ్‌ స్పష్టం చేసింది. గత ప్రభుత్వం హయాంలో సాధారణ సేవల రంగంలో మూలధన వ్యయం రూ.300 కోట్ల లోపు  ఉంటే ఇప్పుడది రూ.6,498 కోట్లకు పెరిగింది. సామాజిక సేవల రంగంలో మూలధన వ్యయం గత ప్రభుత్వ హయాంలో రూ.2,890 కోట్ల లోపు ఉంటే అది ఇప్పుడు రూ.5,206 కోట్లు వ్యయం చేసింది. 

మరిన్ని వార్తలు